అక్కడ బీఫ్ తిని.. ఇండియాకు రండి: కేంద్ర మంత్రి
అక్కడ బీఫ్ తిని.. ఇండియాకు రండి: కేంద్ర మంత్రి
Published Fri, Sep 8 2017 10:46 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
సాక్షి, భువనేశ్వర్: ఓవైపు గోమాంస నిషేధంపై వివిధ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా టూరిజం శాఖ(సహాయ) బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తిన్నాకే ఇండియాకు రావాలంటూ విదేశీ టూరిస్ట్‌లకు ఆయన సూచించారు.
భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్ టూరిస్ట్ అసోషియేషన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియా ఆయనను పలకరించగా, బీఫ్ బ్యాన్‌పై ఆయన స్పందించారు. ‘వాళ్లు(విదేశీ టూరిస్ట్‌లు) వాళ్ల సొంత దేశాల్లో బీఫ్ తిన్న తర్వాతే .. ఇండియాకు రావాల్సి ఉంటుంది’ అంటూ నవ్వుతూ ఓ ప్రకటన ఇచ్చారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేవని ఇంతకు ముందు ఈయనే వ్యాఖ్యానించారు. అయితే గోమాంస నిషేధం చాలా సున్నితమైన అంశమని, స్పందించేందుకు తానేం ఆహార శాఖ మంత్రిని కాదని తర్వాత ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు.
గోమాంస నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల్లో మంత్రి ఆల్ఫోన్స్ సొంత రాష్ట్రం కేరళ కూడా ఉంది. జంతువుల అమ్మకం అనేది మాంసం కోసం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించిన విషయం తెలిసిందే.
Advertisement