యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
న్యూఢిల్లీ/ఘజియాబాద్: బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన 960 మంది తబ్లిగీ జమాత్‌కు చెందిన విదేశీ కార్యకర్తల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. వారితో పాటు, ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉన్న తబ్లిగీ విదేశీ కార్యకర్తల్లో 379 మంది ఇండోనేసియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మార్ వారు, 33 మంది శ్రీలంక వారు ఉన్నారని పేర్కొంది.
కిర్గిస్తాన్(77), మలేసియా(75), థాయిలాండ్(65), ఇరాన్(24), వియత్నాం(12), సౌదీ అరేబియా(9), ఫ్రాన్స్(3)లకు చెందిన విదేశీ తబ్లిగీ కార్యకర్తల వీసాలను కూడా రద్దు చేశామంది. ఆ 960 మందిలో కజకిస్తాన్, కెన్యా, మడగాస్కర్, మాలి, ఫిలిప్పైన్స్, ఖతార్, రష్యా తదితర దేశాల వారు కూడా ఉన్నారని తెలిపింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వీరిని ఇప్పుడు ఆయా దేశాలకు తిరిగి పంపే ఆలోచన లేదని, వారిపై ఫారినర్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద వీసా నిబంధనలను ఉల్లంఘించిన నేరాల కింద చర్యలు తీసుకోనున్నామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
‘వారిపై చర్యలు ప్రారంభమైన ప్రస్తుత సమయంలో వారిని వెనక్కు పంపే ప్రశ్నే లేదు. ఎప్పుడు పంపిస్తామన్నది నిబంధనలకు లోబడి నిర్ణయిస్తాం’ అన్నారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిన 360 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించామని శ్రీవాస్తవ తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తగా 1930 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నారు.
► కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 8800007722ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో పర్యటించారు. కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహించారు.
యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసుపత్రిలో నర్సులపై తప్పుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ జమాత్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసింది. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. నర్సులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరిగారని, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, వెకిలి చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, తామిచ్చే ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించారని ఆ ఆరుగురిపై నర్సులు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. కనౌజ్‌లోని జామామసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు గుమికూడటాన్ని నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్–19 బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగును క్వారంటైన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు.
కోవిడ్‌పై పోరుకు ఆ ఘటనలతో విఘాతం
ఆనంద్ విహార్ వద్ద భారీ సంఖ్యలో వలస కార్మికులు గుమికూడటం, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ యావత్ దేశం కరోనా కట్టడికి చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.