సర్‌ప్రైజ్.. ఎంతో థ్రిల్ అయ్యా!
సాక్షి, న్యూఢిల్లీ: మీడియాను, ప్రజలను ఊహించనిరీతిలో ఆశ్చర్యపరచడం, విస్మయానికి గురిచేయడం నరేంద్రమోదీ-అమిత్ షా ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి పెద్దనోట్ల రద్దు వరకు ఇదేరీతిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్న మోదీ-షా ద్వయం తాజాగా కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ ఎవరూ ఊహించనివిధంగా కొత్తవారికి పెద్దపీట వేయడం గమనార్హం. తాజాగా ప్రమాణం చేయబోతున్న 9మంది కేంద్ర మంత్రుల్లో నలుగురు మాజీ బ్యూరోక్రాట్లు ఉండటం గమనార్హం. వీరిలో ఇద్దరు తొలిసారి లోక్‌సభకు ఎన్నిక కాగా, మరో ఇద్దరు పార్లమెంటు సభ్యులు కాదు. మాజీ బ్యూరోక్రాట్లు అయిన హర్‌దీప్ సింగ్ పూరి, కేజే అల్ఫోన్స్, రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్), సత్యపాల్ సింగ్ కేంద్రమంత్రులుగా పగ్గాలు చేపడుతున్నారు.
ఇన్నాళ్లు పరిపాలన విభాగంలో పనిచేసి.. పాలనను నిశితంగా గమనించిన ఈ నలుగురు మోదీ టీమ్‌లో భాగంగా మంచి పనితీరు కనబరుస్తారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అనూహ్యంగా కేంద్ర కేబినెట్‌లో అవకాశం కల్పించడంపై ఈ నలుగురు ఆనందం వ్యక్తం చేశారు.
'నేను ఊహించలేదు. ఎంతో థ్రిల్‌కు గురయ్యాను. ఇది గొప్ప సర్‌ప్రైజ్' అని అనూహ్యంగా తెరపైకి వచ్చిన కేరళ మాజీ ఐఏఎస్ అధికారి కేజే అల్ఫోన్స్ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రధాని మోదీ టీంలో నన్ను తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు' అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. 'నా సామర్థ్యంపై విశ్వాసం కనబరిచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. నా పోర్ట్‌ఫోలియో ఏమిటో ఇంకా నిర్ణయించలేదు' అని మరో మాజీ బ్యూరోక్రాట్ ఆర్కే సింగ్ తెలిపారు.