బీఫ్‌పై కొత్త కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వంలో టూరిజం శాఖ సహాయమంత్రిగా చేరిన మాజీ బ్యూరోక్రాట్ కేజే ఆల్ఫోన్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, క్రైస్తవులకు మధ్య తాను వారధిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు.
’మోదీ సర్కారు సమ్మిళిత దృక్పథంతో ముందుకుసాగుతోంది. మీరు ఏ విశ్వాసాన్నైనా కలిగి ఉండండి. మేం మిమ్మల్ని కాపాడుతామన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ హయాంలో ఒక్క చర్చినిగానీ, మసీదుగానీ ఘటన లేదు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు’ అని ఆల్ఫోన్స్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజాయితీ గల అధికారిగా పేరుతెచ్చుకున్న కేజే ఆల్ఫోన్స్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టే తరుణంలోనూ తన దృఢవైఖరిని చాటుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ పూర్వపు మంత్రి మహేశ్ శర్మ నుంచి పగ్గాలు అందుకునేందుకు దాదాపు గంటసేపు వేచిచూసిన ఆయన.. లాంఛనంగా మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టేవరకు ఆ చైర్‌లో కూర్చోవడానికి కూడా నిరాకరించారు.
బీఫ్ తినడం, గో రక్షకులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువధపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. గోరక్షకులు కొట్టిచంపేస్తున్నా.. ప్రభుత్వాలు తీవ్రంగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన మనోహరి పారికర్ రాష్ట్రంలో బీఫ్ కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పారికర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆల్ఫోన్స్.. రాష్ట్రాల్లో ఆహార అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు.