
న్యూఢిల్లీ: వృద్ధాప్యంతో వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వారికి ఆధార్ ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సమాయత్తమవుతోంది. జూలై 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్‌వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది.
తెల్లోడి ముందు దుస్తులు విప్పగా లేనిది...
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆధార్ సమాచారం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆదివారం వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వీసా కోసం విదేశీయుల ముందు దుస్తులు విప్పడానికి కూడా సిద్ధపడే భారతీయులు..ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడిగితే మాత్రం ప్రైవసీ దెబ్బతింటుందని రాద్ధాంతం చేస్తున్నారని చురకలంటించారు. ‘ అమెరికా వీసా కోసం నేను కూడా 10 పేజీల దరఖాస్తును నింపా. తెల్లవాడికి మన వేలిముద్రలు ఇవ్వడానికి, వారి ముందు నగ్నంగా నిలబడటానికి మనకేం అభ్యంతరం ఉండదు. కానీ మన ప్రభుత్వమే పేరు, చిరునామా లాంటి వివరాలు అడిగితే మాత్రం గోప్యతను ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు.