పట్న : కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ పై తీవ్ర స్థాయిలో ఓ మహిళ మండిపడిన వీడియో మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వీవీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా మంత్రిపై వేలెత్తి చూపిన ఆమె తెగువను పలువురు అభినందించారు కూడా. దీనిపై సదరు వీడియోలో ఉన్న మహిళ.. బిహార్‌కు చెందిన డాక్టర్ నిరాల సిన్హా మీడియా ముందుకు వచ్చి స్పందించారు.
‘‘వీవీఐపీ కల్చర్ మూలంగా దేశంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాళ్లే కాదు.. ప్రతీ పౌరుడూ దేశానికి అవసరమే. సెలబ్రిటీలు, నేతలు అన్న తేడా లేకుండా సేవలు అందరికీ అందాల్సిన అవసరం ఉంది’’ అని నిరాల ఓ ఛానెల్‌తో అభిప్రాయపడ్డారు. తన కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియల కోసం తాను బయలుదేరానని.. కానీ, మంత్రి మూలంగానే ఆ కార్యక్రమానికి తాను హాజరుకాలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఇంఫాల్‌లో వైద్యురాలిగా పని చేస్తున్న నిరాల నవంబర్ 21న పట్నకు ఇండిగో విమానంలో ప్రయాణానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో మంత్రి ఆల్ఫోన్స్ రాక సందర్భంగా ఎయిర్‌లైన్స్ వాళ్లు ఆమె ప్రయాణించాల్సిన విమానాన్ని ఆలస్యం నడిపారు. దీంతో ఆమె మీడియా ముందే మంత్రిపై ధ్వజమెత్తారు. అయితే అంత జరిగినా మంత్రి తనకు సాయం చేయకపోగా.. ఏం పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో నిరాల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
మంత్రి వివరణ...
రాష్ట్రపతి, ప్రధాని విషయంలో ఖచ్ఛితంగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. మంత్రులు, మిగతా నేతల విషయంలో అలాంటి నిబంధనలు ఏం ఉండవు. ఆ సమయంలో రాష్ట్రపతి కోవింద్ అక్కడ రావటంతో విమానాలు ఆలస్యం అయ్యాయి. అంతే తప్ప ఆ మహిళ వాదిస్తున్న దాంట్లో వాస్తవం లేదు అని ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment