సంప్రదాయమా? రాజ్యాంగమా?
శబరిమల గుడిలో స్త్రీలకు నో ఎంట్రీ రాజ్యాంగ పరీక్షకు నిలబడుతుందా?
సంప్రదాయం పేరుతో సమర్థించుకోలేరు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని సంప్రదాయం పేరుతో సమర్థించుకోలేరని సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ‘రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైన సంప్రదాయాల ఆధారంగా మీరు మహిళలకు అనుమతి నిరాకరించజాలరు. వారిని అనుమతించకపోవడానికి ఒక భౌతిక అంశం(రుతుస్రావం) నిర్ణయాత్మకమా?’ అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ‘శబరిమల దేవుడి పవిత్రత కోసం ఆలయ నిర్వాహకులు ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆ దేవుడు బ్రహ్మచారి కాబట్టి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను రానివ్వడం లేదు.
అయితే ఇది రాజ్యాంగ పరీక్షకు నిలబడుతుందా? ఆచారాలు, సంప్రదాయాల ప్రాతిపదికన వారిని అడ్డుకుంటారా? హిందూమతంలో హిందూ పురుషుడు, హిందూ స్త్రీ అనే భేదం లేదు. హిందువు అంటే హిందువే. దీనికి ఈ సంప్రదాయంతో సంబంధం లేదు’ అని పేర్కొంది. మహిళలకు ప్రవేశంపై రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించింది. శబరిమల గుడిలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగంలోని 25వ అధికరణం కింద మహిళలకు ఆలయంలో పూజలు చేసే హక్కు ఉందని హ్యాపీ టు బ్లీడ్ ఎన్జీఓ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఆలయంలోకి అనుమతించకపోవడంతో దేశంలో మహిళలు కొత్త అస్పృశ్యులుగా మారుతున్నారన్నారు. దీనిపై కోర్టు మండిపడింది. ‘అలా పోల్చొద్దు. మీరు ఆదిశక్తి. ఈ సంతతిని మీరే సృష్టించారు. మేం సమానులం అని చెప్పండి’ అని సూచించింది. ఈ కేసును ప్రస్తుతానికి ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించాలన్న పిటిషనర్ల వినతిని తోసిపుచ్చింది. ‘ఇందులో రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు ఉన్నాయని మేం భావిస్తే ఈ ధర్మసనానికి బదలాయిస్తాం’ అంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.