నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ: శబరిమల ఆలయ పరిసరాల్లో మూడో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా భక్తులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మాస పూజల కోసం బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు కేరళ చేరుకున్నారు. కాగా వారు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. బుధ, గురు వారాల్లో ఆలయ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు, భక్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసకుంది. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేరళలో టెన్షన్ వాతావరణం చోటుచేసకుంది.
మరోవైపు శుక్రవారం 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య బుల్లెట్ ఫ్రూప్ జాకెట్, హెల్మెట్ ధరించిన ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు జర్నలిస్టు కాగా, మరోకరు మహిళ కార్యకర్త ఉన్నారు. భక్తులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని శబరిమల పోలీసు కార్యాలయానికి తరలించారు. భక్తుల నిరసనల నేపథ్యంలో లోనికి అనుమతించడం సాధ్యం కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మహిళా జర్నలిస్టులు మాత్రం తాము దర్శనం చేసుకునే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఐజీ శ్రీజిత్ వారిని అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయ ప్రధాన పూజారి కూడా మహిళల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెన్‌కోర్ ఆలయ కమిటీ ఈరోజు భేటీ కానుంది.
కాగా, మహిళా జర్నలిస్టుల చర్యలపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల ముసుగులో అలజడి సృష్టించవద్దని పేర్కొంది. నిరసనల నేపథ్యంలో వారిని వెనక్కి వెళ్లాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసింది. గురువారం కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన న్యూయార్క్ టైమ్స్‌కు ఇద్దరు మహిళ జర్నలిస్టులను భక్తుల ఆందోళనల నేపథ్యంలో బలవంతంగా వెనక్కి పంపిచారు.
Comments
Please login to add a commentAdd a comment