చెన్నై: శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే... శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను నటిస్తున్న ‘పేట్టా’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ లక్నో నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఏళ్లుగా ఉంటోందని, ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు.
అటు దేశాన్ని కుదిపేస్తున్న మీటూ వివాదంపైనా రజనీకాంత్ స్పందించారు. ‘మీటూ’ ఉద్యమంతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. అయితే దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. సరైన రీతిలో మీటూను బాధిత మహిళలు వినియోగించుకోవాలన్నారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను వైరముత్తు తోసిపుచ్చారని...తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా వైరముత్తు చెప్పారని గుర్తుచేశారు. ఈ ఏడాది డిసెంబర్ 12వ, తేదీన పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తాను చెప్పలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment