న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న తరుణంలో శబరిమలను దర్శించే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శబరిమల సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్యను రోజుకి 3000 నుంచి 5000కు పెంచడం పోలీసులు, వైద్య అధికారులపై పెనుభారాన్ని మోపుతుందని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 14 మకర సంక్రాంతి వరకు శబరిమల ఆలయ ఉత్సవాల సీజన్ కావడంతో కోవిడ్ ప్రబలే ప్రమాదాన్ని నివారించేందుకు భక్తుల సంఖ్యను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం మేరకు ప్రస్తుతం ప్రతి రోజూ 2000 మంది భక్తులను, వారాంతాల్లో 3,000 మంది భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల సంఖ్యను పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో, డిసెంబర్ 18న కేరళ హైకోర్టు రోజుకి 5000 మంది భక్తులు ఆలయ సందర్శనకు అనుమతించొచ్చంటూ ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment