
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ : శబరిమల ఆలయం పరిసర ప్రాంతాల్లో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళా భక్తులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ.. భక్తులు చేపట్టిన ఆందోళన బుధవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరపడాన్ని నిరసిస్తూ.. గురువారం బంద్ చేపట్టారు. హిందూ సంఘాలు, భక్తుల బంద్‌తో కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక, తమిళనాడు బస్సులను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేశారు.
బంద్‌తో కేరళ అంతటా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ సంస్థలు చేపట్టిన బంద్‌కు బీజేపీ, దాని అనుబంధ పార్టీలు మద్దతు ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొనకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నట్టు తెలిపింది.
మోహన్ భగవత్ స్పందన
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సమాజం, మహిళలు అంగీకరించి ఎంతోకాలంగా పాటిస్తున్న సంప్రదాయాలను పట్టించుకోకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, శబరిమలలోకి మహిళలను అనుమతించే విషయంలో మతపెద్దల అభిప్రాయాలను, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి సుప్రీంకోర్టు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.