తిరువనంతపురం : శబరిమల ఆలయ కమిటీ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవాస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం తీర్పు అనంతరం గత బుధవారం ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆలయ కమిటీతో సహా పలు సంఘాలు మహిళల ప్రవేశంను అడ్డుకున్నాయి. అంతటితో ఆగకుండా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో శబరిమలలో గత మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాజకీయ దుమారం..
పరిస్థితి మరింత హింసాత్మకంగా మారుతుండంతో సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం తీర్పును అమలు చేసి తీరుతామని.. తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శబరిమలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహిస్తున్నారని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చీవేత తరహాలో కేరళలో కూడా విధ్వంసం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కేవలం కాషాయరంగు దుస్తులు దరించిన వ్యక్తులే మహిళఫై రాళ్లు రువ్వుతున్నారని.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు వారు పాల్పడ్డారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment