
వైభవంగా అయ్యప్ప మందిర వార్షికోత్సవం
పట్టణంలో ప్రసిద్ధిచెందిన అయ్యప్ప మందిర వార్షికోత్సవ వేడుకలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. అయ్యప్ప సేవా సమితి సంస్థాపకులు కార్పొరేటర్ సంతోష్ ఎమ్. శెట్టి ఆధ్వర్యంలో వరాలదేవి మందిరం సమీపంలోనే నిర్మించిన అయ్యప్ప మందిరానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా ఉదయం కేరళ నుంచి వచ్చిన వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గణపతి పూజా, సుబ్రమణ్యం పూజా, అయ్యప్పస్వామి పూజా, హారతి తదితరాలు జరిగాయి. సాయంత్రం మేళతాళాల మధ్య అయ్యప్పస్వామి పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. 108 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి హారతి తాంబూలు చేతులో పట్టుకొని, పంబానది నుంచి తీసుకువచ్చిన ఆకాశ గంగా జలంతో కూడిన కలశాలను తలపై పెట్టుకొని పాల్గొన్నారు. మందిరం నుంచి ప్రారంభమైన ఊరేగింపు కాలేజ్ రోడ్, బాజి మార్కెట్, వరాలదేవి రోడ్ మీదుగా తిరిగి అయ్యప్ప మందిరానికి రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంది.
దారిమధ్యలో వందల సంఖ్యలో భక్తులు మంగళ హారతులు పట్టారు. కార్పొరేటర్ సంతోష్ ఎమ్. శెట్టి, నగర్‌సేవిక శశిలత శెట్టి, పద్మశాలి సమాజ్ యువక్ మండలి అధ్యక్షులు రాము వడ్లకొండ, కళ్యాడపు భూమేష్, మేర్గు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.