
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో నిబంధనలు మార్చుతూ ఈ నెల 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే తీర్పును సమీక్షించాలని కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని, 10 రోజుల అనంతరం సమగ్రంగా పరిశీలిస్తామంది.
చట్టంలోని ఏ నిబంధనను నీరుగార్చే ప్రయత్నం చేయలేదని, అమాయకుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించే ఉద్దేశంతోనే రక్షణ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. ఆందోళనకారులు తీర్పును సరిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వారిని పక్కదారి పట్టించి ఉండవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యు యు లలిత్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. మార్చి 20న ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ ఈ ధర్మాసనమే తీర్పు వెలువరించింది.
జీవించే హక్కుకు భంగం కలగకూడదు..
‘అమాయకుల్ని శిక్షించకూడదనే మేం చెప్పాం. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని నిబంధనల్ని ఆసరాగా చేసుకుని అమాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయకూడదు. జీవించే హక్కుకు భంగం కలిగించడాన్ని మేం కోరుకోవడం లేదు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ చట్టానికి లేదా ఫిర్యాదులకు మేం వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగా చెప్పాం’ అని తీర్పును ధర్మాసనం మరోసారి గుర్తుచేసింది.
రివ్యూ పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ.. మార్చి 20 నాటి తీర్పును నిలుపుదల చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వినతిని కోర్టు తోసిపుచ్చింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం వేసిన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ... ఈ కేసులో ప్రధాన పిటిషన్‌లోని అసలు కక్షిదారులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వింటామని తెలిపింది.
రివ్యూ పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర కక్షిదారులు రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కోర్టుకు అనుమతి తెలిపాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల్లో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా సోమవారం ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
ఎఫ్‌ఐఆర్ లేకుండానే పరిహారం ఇవ్వొచ్చు
‘ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లో పేర్కొన్న నేరాలకు సంబంధించిన అంశాలు మాత్రమే తీర్పు పరిధిలోకి వస్తాయి. ఐపీసీ కింద కేసు పెట్టదగిన నేరాల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందస్తు విచారణ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని ఏ నిబంధనను మేం బలహీనపరచలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే వేధింపుల బాధితులకు నష్టపరిహారం చెల్లించవచ్చు.
ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదైన నేరాలపై విచారణ పూర్తి చేయడానికి ఇచ్చిన ఏడు రోజుల గడువు కేవలం గరిష్ట పరిమితి మాత్రమే... మీరు కావాలంటే పది నిమిషాల్లో లేదా అరగంట, గంటలో ఆ పని పూర్తి చేసి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు. ఇతర చట్టాల్లో ఉన్నట్లే ముందస్తు బెయిల్ కోసం నిబంధనల్ని ప్రవేశపెట్టాం’ అని బెంచ్ స్పష్టం చేసింది.
ఎలాంటి నిర్ధారణ లేకుండా మీపై ఆరోపణలు చేస్తే మీరు పనిచేయగలరా? ప్రభుత్వాధికారిపై అలాంటి ఆరోపణలు చేస్తే అతను లేదా ఆమె పనిచేయగలరా? అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. ‘అలాంటి పరిస్థితుల్లో వారు పనిచేయలేరు. పరిష్కార మార్గం చూపకుండా అమాయకుల హక్కుల్ని దూరం చేయలేం’ అని కోర్టు పేర్కొంది.
రివ్యూ పిటిషన్‌ను తక్షణమే విచారించాలి: కేంద్రం
ఈ సందర్భంగా రివ్యూ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. సోమవారం జరిగిన హింసలో వందల కోట్ల ఆస్తినష్టం జరిగిందని, పలువురు ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం వేధింపుల బాధితుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ.. నిజమైన కేసుల్లో నిందితుడ్ని విడుదల చేయమని తాము చెప్పలేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment