Setback To Sidhu In Road rage Case: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల కిందటి కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం 58 ఏళ్ల సిద్ధూకి నోటీసులు జారీ చేసింది.
నోటీసు పరిధిని పెంచాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు, సిద్ధూ తరపు న్యాయవాదిని కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని జాబితా చేయనున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. సిద్ధూ పాల్పడింది ఘోరమైన నేరంగా పరిగణించి.. తీర్పును పునఃసమీక్షించాలని బాధిత కుటుంబం సుప్రీంను అభ్యర్థించింది. అయితే ఘటన జరిగిన ఇన్నేళ్లకు(33 ఏళ్లకు) నేర తీవ్రత గురించి పిటిషనర్లు లేవనెత్తడం విడ్డూరంగా ఉందని, పిటిషన్‌పై అనుమానాలు ఉన్నాయని సిద్ధూ తరపున పి.చిదంబరం వాదించారు.
అంతకు ముందు తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ సిద్ధూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ల కిందినాటి కేసు గనుక పరిగణనలోకి తీసుకోకూడదంటూ విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ కోర్టు బాధితుల అభ్యర్థననే పరిగణనలోకి తీసుకుంది.
కేసు పూర్వపరాలు..
1988, డిసెంబర్ 27న పాటియాలాలో సిద్ధూ, అతని స్నేహితుడు రూపీందర్ సింగ్ సంధూ పార్కింగ్ విషయంలో గుర్నమ్ సింగ్ అనే వ్యక్తితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో గుర్నమ్‌ను కారులోంచి బయటకు లాగేసి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో గుర్నమ్ చనిపోయారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సిద్ధూని నిర్దోషిగా వదిలేయగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు మాత్రం 2006లో దోషిగా గుర్తించి.. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై 2007లో సుప్రీంను ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉపశనంతోనే.. అమృత్‌సర్ నియోజకవర్గం తరపున లోక్‌సభలో పోటీ చేయడానికి సిద్ధూకి అనుమతి దొరికినట్లయ్యింది.
తిరిగి 2018, మే 15న.. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఒక వృద్ధుడ్ని తీవ్రంగా గాయపర్చిన నేరానికి సిద్ధూ, అతని స్నేహితుడికి వెయ్యి రూపాయల ఫైన్ విధించింది. ఒక దెబ్బకే చనిపోయాడని చెప్పడానికి ఆధారాలు లేనందున ఈ తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించింది బెంచ్. అయితే తీర్పుపై రివ్యూ చేపట్టాలని బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment