ఛండీగఢ్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల కిందటి నాటి ఓ కేసులో.. కిందటిఏడాది ఆయనకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటియాలా జైలు నుంచి బయటకు రాగానే తాను మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమన్నారు.
వాస్తవానికి ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది శిక్ష విధించింది సుప్రీం కోర్టు. దాని ప్రకారం మే నెలలో ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ, శిక్షాకాలంలో సత్‌ప్రవర్తన కారణంగానే ఆయన ముందుగా విడుదల అవుతున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆదివారాలు పోనూ, సత్‌ప్రవర్తన కింద 48 రోజుల్ని మినహాయించి.. ముందుగానే సిద్ధూను రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని సిద్ధూ న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ కూడా ధృవీకరించారు.
Will address the media outside patiala jail around noon..
— Navjot Singh Sidhu (@sherryontopp) April 1, 2023
1988, డిసెంబర్ 27వ తేదీన పాటియాలలో పార్కింగ్ విషయంలో జరిగిన ఓ గొడవలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్‌సంధూలు.. ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాధితుడు 65 ఏళ్ల గురునమ్ సింగ్ మరుసటిరోజు కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. సిద్ధూ, గురునమ్ తలపై బలంగా కొట్టాడని, ఆ గాయం కారణంగానే అతను చనిపోయాడని బాధిత కుటుంబం వాదించింది. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే..
2018లో సుప్రీం కోర్టు సిద్ధూ నేరాన్ని సాధారణమైందిగా ప్రకటిస్తూ.. వెయ్యి రూపాయల జరిమానా విధించింది. చివరకు బాధిత కుటుంబం మరోసారి కోర్టును ఆశ్రయించడంతో కిందటి ఏడాది తీర్పును సమీక్షించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో.. నేర తీవ్రత దృష్ట్యా సిద్ధూకి జైలు శిక్ష తప్పనిసరి అని అభిప్రాయపడ్డ కోర్టు, ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment