
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్‌సీ, ఎస్‌టీ చట్టంపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరిచింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల హక్కుల పరిరక్షణకు నూరు శాతం కట్టుబడి ఉన్నామని కోర్టు కేంద్రానికి తెలిపింది. దళితులపై వేధింపులకు పాల్పడే దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవి కావని, వాటిపై స్టే విధించాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది.
తమ రివ్యూ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని కేంద్రం కోర్టును కోరింది. అయితే ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ కేసును నిర్థారించే న్యాయమూర్తుల కులాలకు సంబంధించి న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన ట్వీట్‌ను కేంద్రం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, ఏమైనా ఈ అంశం ముగిసిపోయిందని (క్లోజ్‌డ్) కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద బాధితులు ఫిర్యాదు చేయగానే తక్షణ అరెస్టులను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు,పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. భారత్ బంద్‌ను నిర్వహించి నిరసన వ్యక్తం చేశాయి. పార్టీ దళిత ఎంపీలు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం ఏప్రిల్ 3న సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment