![Yashwant Sinha Arun Shourie move Supreme Court seeking review of Rafale verdict - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/2/sc.jpg.webp?itok=gysLXjzF)
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్‌లను తోసిపుచ్చుతూ డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు బుధవారం సర్వోన్నత న్యాయస్దానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం సంతకం చేయకుండా సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నోట్‌లో పేర్కొన్న అవాస్తవ అంశాల ఆధారంగా తీర్పు వెలువరించారని రివ్యూ పిటిషన్‌లో వారు ఆరోపించారు. ఓపెన్ కోర్టులో తమ పిటిషన్ విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కాగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందంలో మోదీ సర్కార్‌ను సమర్ధిస్తూ తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది.
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్‌సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment