మరిన్ని చిక్కుల్లో పాక్ మాజీ ప్రధాని..
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అనర్హత వేటు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యలు వేసిన పిటిషన్‌ను ఆదేశ సుప్రీం కోర్టు శుక్రారం తోసిపుచ్చింది. గత నెల షరీఫ్ తరపున ఆయన కూతురు మర్యమ్ నవాజ్, తనయులు హుస్సేన్ నవాజ్ మరియు హస్సన్ నవాజ్, అల్లుడు కెప్టెన్ సఫ్దార్‌లు పిటిషనర్లుగా పేర్కొంటూ న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా రివ్యూ పిటిషన్‌ను ఫైల్ చేశారు. అక్రమ ఆరోపణలపై విచారణ అంశం అసలు కోర్టు పరిధిలోకే రాదంటూ వాళ్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారించిన ఐదుగురి జడ్జిల ప్యానెల్ రివ్యూ పిటిషన్‌లన్నిటినీ తిరస్కరించింది. నవాజ్ షరీఫ్‌ను పదవి నుంచి తొలగించడాన్ని కోర్టు సమర్ధించింది.దుబాయ్ కంపెనీలకు చెందిన ఆదాయాన్ని 2013 ఎన్నికల సమయంలోని నామినేషన్ పేపర్లలో షరీఫ్ పేర్కొనలేదంటూ పనామా పేపర్ల లీకేజీతో వెలుగులోకి రాగా, ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయన దోషిగా ప్రకటించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(F) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తూ జూలై 28న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.