మున్సిపల్ ఎన్నికలు నాలుగు వారాల్లో నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు నాలుగు వారాల్లో నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో.. తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంతోపాటు, మరోవైపు ఎన్నికల నిర్వహణకున్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 163 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లు ఉంటే.. అందులో 146 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే వీటిలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించామని, రాష్ట్ర వ్యాప్తంగా చైర్‌పర్సన్‌లు, మేయర్లకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2013 ఓటర్ల జాబితా ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అధికారవర్గాలు వివరించాయి.
2014 జనవరి 31న ఈసీ కొత్త ఓటర్ల జాబితాను ప్రకటించింది.
కొత్తగా 76 లక్షల ఓటర్లు చేరారు. వారిలో బీసీ ఓటర్లను లెక్కించి, మళ్లీ వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
హైకోర్టు తీర్పులో తాజా ఓటర్ల జాబితా అని ఉంటే విధిగా మళ్లీ బీసీ గణన తప్పనిసరి అవుతుంది.
బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్లకు 40 రోజుల గడువు కావాలి.
ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాల్సి వస్తుంది.
పునర్విభజన కార్యక్రమం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల న్నింటిలో పూర్తి కాలేదు.
ఎన్నికలపై సీఎం కిరణ్ అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది.
ఎన్నికలకు మేము సిద్ధం: రమాకాంత్‌రెడ్డి
మున్సిపల్ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించిన తరువాత నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. కాగా దీనిపై కోర్టు ఆర్నెల్ల కిందే ఉత్తర్వులు జారీ చేసి ఉంటే ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను స్వాగతిస్తూనే.. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన లేదని, సీఎం ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో లేరన్నారు.