టెల్కోలకు ‘సుప్రీం’ షాక్‌ | Supreme Court dismisses AGR review petitions filed by telecom companies | Sakshi
Sakshi News home page

టెల్కోలకు ‘సుప్రీం’ షాక్‌

Published Fri, Jan 17 2020 4:58 AM | Last Updated on Fri, Jan 17 2020 9:38 AM

Supreme Court dismisses AGR review petitions filed by telecom companies - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడుకున్న బెంచ్‌ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఓపెన్‌ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్‌–చాంబర్‌ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.  

తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్‌టెల్‌
ఏజీఆర్‌ బకాయీలపై పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. దీనిపై క్యూరేటివ్‌ పిటీషన్‌ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ‘టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అటు వొడాఫోన్‌ ఐడియా కూడా క్యూరేటివ్‌ పిటిషన్‌ వేసే యోచనలో ఉంది.

ఇంటర్నెట్‌ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్‌ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్‌ రాజేశ్‌ ఛారియా వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటిషన్‌ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్‌ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్‌పీల మనుగడ కష్టమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు.

వివాదమిదీ..
టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్‌ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్‌ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది.  ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు.

టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్‌ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతీ ఎయిర్‌టెల్‌ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) ఉంటాయి.

భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్, టాటా టెలిసర్వీసెస్‌ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్‌టెల్‌ కోరింది. ఈ రివ్యూ పిటిషన్‌లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయక తప్పదంటూ వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్‌ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement