gross revenue
-
పెరిగిన టెల్కోల ఆదాయం: టాప్‌లో ఎవరంటే?
సాక్షి,న్యూఢిల్లీ: టెలికం కంపెనీల ఆదాయం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో టర్నోవరు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.27 శాతం వృద్ధితో రూ.71,588 కోట్లు నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) 16.5 శాతం అధికమై రూ.47,623 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి సమకూరిన లైసెన్స్ ఫీజు 16.49 శాతం పెరిగి రూ.3,809 కోట్లకు చేరింది. అలాగే స్పెక్ట్రం వాడినందుకు వసూలైన రుసుం 22.22 శాతం హెచ్చి రూ.1,538 కోట్లు నమోదైంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను వెల్లడించింది. రిలయన్స్ జియో రూ.17,181 కోట్లుతో టాప్‌లో ఉండగా, భారతి ఎయిర్టెల్ రూ.11,340 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.6,588 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.2,135 కోట్ల ఏజీఆర్ సాధించాయి. టాటా టెలిసర్వీసెస్ రూ. 584.1 కోట్లు, ఎంటిఎన్ఎల్ రూ .369.84 కోట్లును సాధించగా, మిగతా కంపెనీలు ఎజిఆర్‌ను 100 కోట్ల రూపాయల కన్నా తక్కువే సాధించాయి. ఈ గణాంకాల ప్రకారం, ఏజీఆర్ ఆధారిత ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం వార్షిక ప్రాతిపదికన 85.07 రూపాయల నుండి 108.78 రూపాయలకు పెరిగింది. చదవండి: కార్పొరేట్ వార్: సుప్రీంకోర్టుకు సైరస్ మిస్త్రీ వైర్లెస్ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు -
టెల్కోలకు ‘సుప్రీం’ షాక్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడుకున్న బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఓపెన్ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్–చాంబర్ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్టెల్ ఏజీఆర్ బకాయీలపై పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీనిపై క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ‘టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు వొడాఫోన్ ఐడియా కూడా క్యూరేటివ్ పిటిషన్ వేసే యోచనలో ఉంది. ఇంటర్నెట్ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్ రాజేశ్ ఛారియా వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటిషన్ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్పీల మనుగడ కష్టమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. వివాదమిదీ.. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది. ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతీ ఎయిర్టెల్ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్, టాటా టెలిసర్వీసెస్ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్టెల్ కోరింది. ఈ రివ్యూ పిటిషన్లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయక తప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
టెల్కోలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. వివాదం ఇదీ.. కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 1.4 లక్షల కోట్లపైనే భారం జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు. వొడాఐడియా షేరు కుదేల్.. లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్ అయ్యింది. బీఎస్ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్టెల్ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్టెల్ తెలిపింది. తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. -
రాబడిలో జియో టాప్
సాక్షి, న్యూఢిల్లీ : ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్టెల్ రూ 6720 కోట్ల ఏజీఆర్‌తో మూడవ స్ధానంలో నిలిచింది. ఇదే త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రెవిన్యూ మార్కెట్ వాటా రూ 1284 కోట్లుగా నమోదైంది. ఆయా కంపెనీల ఏజీఆర్‌ల ఆధారంగానే లైసెన్స్ ఫీజు, ఇతర ఫీజుల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రాబడిని లెక్కిస్తారు. ఇక గత ఏడాది రిలయన్స్ జియో ఏజీఆర్ ఈ త్రైమాసికంలో రూ 7125 కోట్లుగా నమోదైంది. ఇక స్ధూల రాబడిలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ల తర్వాత జియో మూడో స్ధానానికి పరిమితమైంది. రూ 13,542 కోట్లతో వొడాఫోన్ ఐడియా ట్రాయ్ జాబితాలో ముందువరుసలో నిలవగా, రూ 11,596 కోట్ల స్ధూల రాబడితో ఎయిర్టెల్ తర్వాత స్ధానంలో నిలిచింది. ఇక రిలయన్స్ జియో రూ 10,738 కోట్ల స్థూలలాభాన్ని ఆర్జించింది. మరోవైపు ఏజీఆర్ మార్కెట్ వాటాలో 22 టెలికాం సర్కిళ్లలో 11 సర్కిళ్లలో జియో ముందుండగా, ఆరు సర్కిళ్లలో ఎయిర్టెల్, 5 టెలికాం సర్కిళ్లలో వొడాఫోన్ ఐడియా భారీ రాబడిని రాబట్టాయని ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. -
13 శాతం పెరిగిన టెల్కోల ఆదాయం
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సేవల రంగ సంస్థల స్థూల ఆదాయం 13 శాతం జంప్ చేసింది. జూన్ 2016 తో ముగిసిన త్రైమాసికంలో గ్రాస్ రెవెన్యూ (జీఆర్) రూ 73,344 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అలాగే సర్దుబాటు చేసిన నికర రాబడి (ఎడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్) 9.2శాతం వృద్ధితో రూ. 53,383 కోట్లుగా ఉంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) త్రైమాసికపు పనితీరు సూచీ నివేదికలో తెలిపింది.గత ఏడాది జీఆర్ 12.79శాతం వృద్ధితో రూ.65,030కోట్ల ఆదాయాన్ని ఏజీఆర్13.26శాతం వృద్ధితో రూ.47,134 కోట్లను ఆర్జించినట్టు రిపోర్ట్ చేసింది. రోమింగ్ ఆదాయం, ఇంటర్ కనెక్ట్ చార్జీలతో కలిపి ఈ ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలిపింది. అలాగే ఫీజు మరియు స్పెక్ట్రమ్ వాడుక ఛార్జీలు (ఎస్ యూసీ) వరుసగా 14 శాతం 12 శాతం పెరిగాయి. దీంతో టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజు ఏప్రిల్-జూన్ నాటికి రూ 4,314 కోట్లకు పెరిగింది. జీఆర్ మరియు ఏజీఆర్ (టెలికాం సేవల ద్వారా ఆదాయం మాత్రమే) అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే... ఈ త్రైమాసికంలో వరుసగా 7.33శాతం,10.34శాతం పెరిగింది .ఏజీ ఆర్ ఆధారంగా టెలికాం సేవలకు యూజర్ (ఏఆర్పీయూ) ప్రకారం నెలవారీ సగటు రాబడి త్రైమాసికంలో రూ 141 కోట్లుగా ఉంది. ఇది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ 127కోట్లుగా ఉంది.