జైలు శిక్ష రద్దు చేయండి
సుప్రీంకోర్టులో జస్టిస్ కర్ణన్ రివ్యూ పిటిషన్
న్యూడిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: కోర్టు ధిక్కరణ కేసులో తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ తన న్యాయవాది మాథ్యుస్ నెదుమ్‌పరా ద్వారా సుప్రీంకోర్టులో గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరపాల్సింది పోయి.. జైలు శిక్ష విధించడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయమూర్తులను తప్పుపట్టాను కానీ న్యాయస్థానాన్ని కాదని ఆయన వివరించారు. ఇది న్యాయస్థానాలను అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కర్ణన్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ సానుకూలంగా స్పందించారు.
‘మీ అభ్యర్థనను అంగీకరిస్తున్నాం. దీన్ని పరిశీలిస్తాం’ అని జస్టిస్ ఖేహర్ అన్నారు. అలాగే జస్టిస్ కర్ణన్ దేశం విడిచి వెళ్లిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తరఫు న్యాయవాదులు ఖండించారు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, చెన్నైలోనే ఉన్నారని తెలిపారు. రివ్యూ పిటిషన్ వేయమంటూ జస్టిస్ కర్ణన్ న్యాయవాదికి సమర్పించిన నోటరీ పత్రాలను కోర్టు చూపించమనడంతో వాటిని మాథ్యూస్ సుప్రీంకోర్టుకు చూపారు. అలాగే కర్ణన్ క్షమాపణలు కోరినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన తరఫు న్యాయవాదులు కొట్టిపారేశారు.
కొనసాగుతున్న గాలింపు..
మరోవైపు జస్టిస్ కర్ణన్‌ను అదుపులోకి తీసుకునేందుకు కోల్‌కతా నుంచి చెన్నై వచ్చిన పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు.