సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి.. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడంటూ 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ యూయూ లలిత్, అశోక్ భుషణ్‌లతో కూడిన ధర్మాసనం మల్యాకు వ్యతిరేకంగా డబ్బు కొల్లగొట్టడం, ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నట్లు అభిప్రాయపడింది. అంతేకాక మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఈ ఏడాది జూన్‌లోనే ఆదేశించింది. అంతేకాక ఈ రివ్యూ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ఏ ఏ అధికారులు డీల్ చేశారో అందరి వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశించింది. (చదవండి: మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!)
ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపు వ్యవహారంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment