న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు.
పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment