
పటియాలా: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్ష ముగించుకుని శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బానిసలుగా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ను అక్బారీ (పత్రికల్లో ప్రకటనలిచ్చే) ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.
రాష్ట్రం శాంతిభద్రతలు, రుణాల సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన పట్టిపీడించిన ప్రతిసారి దేశంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా ఈసారి పుట్టుకొచ్చిన విప్లవమే రాహుల్ గాంధీ’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988లో ఒక రోడ్డు ప్రమాద గొడవలో ఘర్షణ పడటంతో ఒకరి మృతికి కారణమైన నేరానికి సిద్ధూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేనెలలో ఒక ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ 10 నెలలకే విడుదలయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సిద్ధూ విడుదల సందర్భంగా జైలు ప్రాంతం ఆయన మద్దతుదారులతో నిండిపోయింది.