ఆ జీవో రద్దుపై సుప్రీంలో రివ్యూ | KCR Says Will File Review Against SC Order Over Quota For Tribal Teachers | Sakshi
Sakshi News home page

ఆ జీవో రద్దుపై సుప్రీంలో రివ్యూ

Published Wed, Jun 10 2020 2:50 AM | Last Updated on Wed, Jun 10 2020 2:55 AM

KCR Says Will File Review Against SC Order Over Quota For Tribal Teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను 100 శాతం స్థానిక గిరిజనులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను (జీవో నంబర్‌ 3/2000) సుప్రీంకోర్టు కొట్టేయడంపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విషయంలో న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు స్థానిక గిరిజనులకు అన్యాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు చెందిన స్థానికులకు అదే ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే విషయంలో 100 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టుకెళ్లగా సుప్రీంకోర్టు ఇటీవల జీవోను కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల స్థానిక ఎస్టీలకు నష్టం జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చారు. 1950 జనవరి 26కు ముందు నుంచీ స్థానికంగా నివాసముంటున్న ఎస్టీలకు స్థానిక ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్‌ ఇచ్చే పద్ధతి ఉందని, దీనివల్ల ఎస్టీలు కొద్దోగొప్పో ప్రయోజనం పొందారని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టేయడం వల్ల ఎస్టీలు రిజర్వేషన్‌ సౌకర్యం కోల్పోతారని వారు వివరించారు. రాజ్యంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు భంగకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. ఎస్టీల రిజర్వేషన్‌ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్‌ వేస్తామని స్పష్టం చేశారు. ఎస్టీల రిజర్వేషన్‌ సౌకర్యం యథావిధిగా కొనసాగేలా అవసరమైన వాదనలతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీలకు రాజ్యాంగమే ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని కాపాడే విషయంలో ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement