సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుపై ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రివ్యూ పిటిషన్లు దాఖ లయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ ఏడాది ఏప్రిల్ 22న 152 పేజీల తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు 50% మించరాదని తీర్పులో పేర్కొంది. అయితే ఇప్పటివరకు చేసిన నియామకాలకు మాత్రం రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపింది.
1986లో చట్ట వ్యతిరేకంగా చేసిన కసరత్తును సరిదిద్దుకోకుండా 2000 సంవత్సరంలో తిరిగి అవే తప్పులు చేశారని, ఒకవేళ ఈ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అవే తప్పులు పునరావృతం చేస్తే, రిజర్వేషన్లు 50 శాతానికి మించి కల్పిస్తే 1986 నుంచి ఇప్పటివరకు చేసిన నియామకాలకు రక్షణ ఉండదని హెచ్చరించింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరు తూ తాజాగా రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ గిరిజన సంఘాల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేశ్ పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితి–తుడుందెబ్బ ద్వారా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, ఆదివాసీ(గిరిజన) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, సువర్ణపాక జగ్గారావు పిటిషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున కూడా అల్లంకి రమేశ్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment