
సాక్షి, న్యూఢిల్లీ : కోయంబత్తూర్‌లో 2010లో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి అనంతరం బాధితురాలితో పాటు ఆమె సోదరుడిని హత్య చేసిన కేసులో తనకు మరణ శిక్షను ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ దోషి మనోహరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన సుప్రీం బెంచ్ ఈ కేసులో దోషి మనోహరన్‌కు విధించిన మరణ శిక్షను సమీక్షించే అవసరం లేదని, అతను నీచమైన నేరానికి ఒడిగట్టాడని స్పష్టం చేసింది. జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించగా, ఇదే బెంచ్‌లో భాగమైన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శిక్షపై మాత్రమే తనకు వేరే అభిప్రాయం ఉందని చెప్పారు.
మెజారిటీ జడ్జిమెంట్‌కు అనుగుణంగా రివ్యూ పిటిషన్ కొట్టివేశామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసులో దోషి మనోహరన్ ఉరి శిక్షను నిలిపివేయాలని గత నెలలో సుప్రీం కోర్టు స్టే విధించింది. తనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ మనోహరన్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 2010, అక్టోబర్ 29న మనోహరన్, సహ నిందితుడు మోహన కృష్ణన్‌లు ఓ గుడి వెలుపల నుంచి స్కూల్‌కు వెళుతున్న మైనర్ బాలిక, ఆమె సోదరుడిని అపహరించి చేతులు కట్టేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిద్దరిపై విష ప్రయోగం చేశారు. విషం ప్రయోగించినా వారు మరణించకపోవడంతో వారి చేతులను కట్టేసి పరాంబికులం-అఖియార్ ప్రాజెక్టు కాలువలోకి వారిని తోసివేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. కాగా పోలీస్ ఎన్‌కౌంటర్‌లో సహ నిందితుడు మోహన కృష్ణ హతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment