
‘రివ్యూ’ అవసరం లేదు!
బీసీసీఐ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసుల అమలుపై జులై 18న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ బీసీసీఐ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ‘రివ్యూ గురించి చేసిన విజ్ఞప్తిని అన్ని విధాలా పరిశీలించాం. మా ఉత్తర్వును వెనక్కి తీసుకునే విధంగా ఎలాంటి తప్పూ కనిపించలేదు. కాబట్టి దీనిని కొట్టివేస్తున్నాం’ అని సుప్రీం స్పష్టం చేసింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం నవంబర్ 10నే ఈ ఉత్తర్వులు ఇచ్చినా... ఇటీవలే దీనిని కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. లోధా సిఫారసుల విషయంలో బహిరంగ విచారణ జరపాలని, ఒక రాష్ట్రం–ఒక ఓటు ప్రతిపాదనను తప్పించాలంటూ బోర్డు వేర్వేరు అంశాలపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు లోధా కమిటీ సూచనల అమలుపై సుప్రీం కోర్టు తుది తీర్పు గురువారం వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది రెండు సార్లు వాయిదా పడగా, గురువారం గనుక తీర్పు వస్తే అది భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేయవచ్చు.