Dalit groups
-
దళితద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు
-
చంద్రబాబు గో బ్యాక్ అంటూ దళిత సంఘాల నినాదాలు
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమాకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులు భారీగా గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబును అడ్డుకోవాడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు దళిత సంఘాలను అడ్డుకున్నాయి. అనంతరం దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. పదిహేనేళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమా దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. కావాలనే దళితుల పేరు చెప్పుకుని చంద్రబాబు కుళ్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దేవినేని ఉమా ఇప్పటికైనా దళితులపై చేస్తున్న కుట్ర రాజకీయం మానుకొవాలన్నారు. లేనిపక్షంలో మళ్లీ ప్రజాక్షేత్రంలో టీడీపీకి బుద్ధి చెబుతామని తెలిపారు. -
టీడీపీకి పట్టిన మైల పోయింది!
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామాతో తమ పార్టీకి పట్టిన మైల పోయిందంటూ టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడులోని నిమ్మగడ్డవారిపాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేసి.. క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, నాయకుడు మమ్మూ సాహెబ్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చామన్నారు. అలాంటి వ్యక్తి నేడు టీడీపీకి రాజీనామా చేయడం దారుణమన్నారు. రావెల రాజీనామాతో పార్టీకి పట్టిన మైల పోయిందంటూ మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందునే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. రావెల రాజీనామా వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీ మండలాధ్యక్షుడు గింజుపల్లి శివరాంప్రసాద్, జెడ్పీటీసీ భాగ్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.విజయ్‌బాబు తెలిపారు. ఆయన ఒంటరిగానే పార్టీని వీడారని చెప్పారు. కాగా, టీడీపీ నేతల తీరుపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. మేమంటే ఇంత చిన్నచూపా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? దళిత ఎమ్మెల్యే అయిన రావెలను కించపరచడం దారుణం. దళితులుంటే టీడీపీకి మైల పడుతుందా? ఇదెక్కడి దుర్మార్గం. పసుపు నీళ్లతో శుద్ధి చేసి టీడీపీకి పట్టిన మైల పోయిందంటారా? ఇది దళితుల మనోభావాలు దెబ్బతీయడమే. – కోడిరెక్క కోటిరత్నం (మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు) -
ఆ తీర్పు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు నిబంధనలను నిర్వీర్యం చేసేలా ఉందని, ఇది ప్రజల్లో ఆగ్రహానికి, అశాంతికి కారణమై దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, అందువల్ల దీనిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తక్షణం అరెస్టులు చేయకుండా మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషనదాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా గురువారం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక నివేదిక సమర్పించింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగంలో ప్రాథమిక భాగమనీ, చట్టాలు చేయగలిగే ఎలాంటి అవకాశమూ కోర్టులకు లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, సమీక్ష ద్వారా, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవటం ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దవచ్చని తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, కోర్టు తీర్పు ఫలితంగా గందరగోళం, ఆగ్రహం, అసంతృప్తి, అశాంతి దేశంలో చెలరేగాయని పేర్కొంది. ఈ తీర్పు చట్టాన్ని బలహీనపరిచేలా ఉందని తెలిపింది. తమ తీర్పును పూర్తిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ దీనిపై సమీక్షించేందుకు గత వారం సుప్రీంకోర్టు నిరాకరించింది. -
భారత్ బంద్ హింసాత్మకం
న్యూఢిల్లీ/భోపాల్/లక్నో: ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటుచేసుకుంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు చోట్ల దళిత ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోవడంతో పాటు పోలీసులతో ఘర్షణ పడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో 9 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. జోధ్‌పూర్‌లో రాస్తారోకోలో పాల్గొన్న వందలాది మంది దళితులు, భీమ్ సేన కార్యకర్తలు మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్తాన్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు. పంజాబ్‌లో ఉదయం నుంచే ఆర్మీ, పారామిలటరీ బలగాల్ని సిద్ధంగా ఉంచారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్‌ల్లో కూడా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పలు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా రైళ్లను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణాకు తీవ్రంగా అంతరాయం కలిగింది. రైల్వే శాఖ 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఉత్తర, తూర్పు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిన బంద్ ఛాయలు దక్షిణాదిలో కనిపించకపోవడం గమనార్హం. ముంబైలో నిరసనకార్యక్రమంలో నినాదాలిస్తున్న కార్యకర్త హుటాహుటిన బలగాలు బంద్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆస్తుల దహనం, కాల్పులు, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఆందోళన సందర్భంగా ఎదురుకాల్పులు జరగడంతో మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ముగ్గురు, గ్వాలియర్ జిల్లాలో ఇద్దరు, మొరేనా జిల్లాలో ఒక్కరు మరణించారు’ అని మధ్యప్రదేశ్ ఐజీ (శాంతి భద్రతలు) మార్కండ్ దేవ్స్కర్ తెలిపారు. మృతుల్లో నలుగురు దళితులు, ఇద్దరు ఉన్నత కులాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒకరు, మీరట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఒకరు మరణించగా.. 9 మంది పోలీసులతో సహా 26 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లకు అల్లర్ల నిరోధానికి ప్రత్యేక్ష శిక్షణ పొందిన 1,700 మందిని హుటాహుటిన పంపింది. అలాగే యూపీకి ఎనిమిది కంపెనీలు, మధ్యప్రదేశ్‌కి నాలుగు, రాజస్తాన్‌కు మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని కేంద్రం తరలించింది. మధ్యప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ పరిస్థితి అదుపు తప్పడంతో మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్, భింద్, మొరేనా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. చంబల్, గ్వాలియర్, సాగర్ రీజియన్లలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల రాళ్లు రువ్వడం, దహనాలు, లూటీలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు కాల్పులు జరపడంతో మొరేనా జిల్లాలో విద్యార్థి నాయకుడు రాహుల్ పాఠక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా హింస మిగతా ప్రాంతాలకు విస్తరించడంతో గ్వాలియర్ పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ఉమేశ్ శుక్లా చెప్పారు. భింద్ జిల్లాలో మరణించిన వ్యక్తిని మహావీర్ సింగ్‌గా గుర్తించామని, మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఝబువాలో ఆందోళనకారులు దుకాణాల్ని లూటీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. భోపాల్‌లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు పలు వాహనాల్ని ధ్వంసం చేశారు. యూపీలో 75 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ హింసలో 40 మంది పోలీసులు సహా 75 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ (శాంతి భద్రతలు) ప్రవీణ్ కుమార్ చెప్పారు. విధ్వంసానికి, దహనాలకు పాల్పడిన 450 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరట్‌లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అజాంగఢ్‌లో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగ్రా, హాపూర్, మీరట్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలు పంపాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్ కేంద్రాన్ని కోరారు. యూపీలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లతో అనేక రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంజాబ్‌లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా హరియాణాలో అంబాలా, రోహ్‌తక్‌తో పాటు చండీగఢ్లోను ఆందోళనలు కొనసాగాయి. భారత్ బంద్ నేపథ్యంలో పంజాబ్‌లో జరగాల్సిన 10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల ఆందోళనకారులు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. డెహ్రాడూన్ , రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. ఘజియాబాద్‌లోని ఒక గుంపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మండి హౌస్ ప్రాంతంలో రోడ్లపై ఆందోళనకారులు బైఠాయించి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే ట్రాక్‌లు, రోడ్లను దిగ్బంధించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన 30 మందిని రాజస్తాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాలో ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌ను ముట్టడించి టికెట్ కౌంటర్లను మూయించివేశారు. పదుల సంఖ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఒడిశా, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనల వల్ల జన సామాన్యానికి అంతరాయం కలిగింది. గుజరాత్‌లోని ప్రధాన పట్టణాల్లో రోడ్లపై ఆందోళనలు చేపట్టడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సుప్రీం తీర్పులో ఏముంది? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దని మార్చి 20న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసుల్లో వారంలోగా ప్రాథమిక విచారణ నిర్వహించి ఫిర్యాదు సరైందేనని నిర్ధారించుకోవాలని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదైనా అరెస్టు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వోద్యోగిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఫిర్యాదు చేస్తే.. ఆ ఉద్యోగికి అరెస్టుకు సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పనిసరి అని చెప్పింది. ఇతరులపై ఫిర్యాదుల విషయంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డీఎస్పీ అనుమతి అవసరమంది. ఈ చట్టం ఆసరాగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలూ చాలా జరుగుతున్నాయంది. సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి వీలైనంత తొందరగా విచారించాలని కోరే చాన్స్ న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. దళితులు, గిరిజనులపై వేధింపుల్ని అడ్డుకునేలా ఉన్న నిబంధనలపై సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టం అసలు ఉద్దేశాన్ని నీరుగార్చేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. దేశంలోని గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. పార్లమెంటు శాసన విధానానికి ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ కేసును బహిరంగంగా విచారించాలంది. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా దళితులు, గిరిజనులు వెనుకబడే ఉన్నారనీ, వారిపై పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్‌ను వీలైనంత తొందరగా విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మంగళవారం సుప్రీంకోర్టును కోరే అవకాశముంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం విభేదిస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీం తీర్పును నిలిపివేయాలని ఆల్ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం నిరాకరించింది. సంయమనం పాటించండి హింసాత్మక సంఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదని, తీర్పు అంశాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో సమగ్ర రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రివ్యూ పిటిషన్‌పై ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయం తీసుకుందని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అభినందించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, మైనార్టీలపై అత్యాచారాల ఘటనలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత ఆజాద్ ఆరోపించారు. -
భారత్ బంద్
-
భారత్ బంద్: బాల్కనీలో నిల్చుంటే.. బుల్లెట్ తగిలి!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చవద్దంటూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘భారత్ బంద్’ ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పోలీసులతో నిరసనకారులు ఘర్షణ పడటం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని మోరెనా ప్రాంతంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు ఇక్కడ రైల్వేట్రాక్‌లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిరసనకారులు, పోలీసులు ఘర్షణ పడుతున్న సమయంలో సమీపంలో ఉన్న భవనం బాల్కనీలోంచి రాహుల్ పాఠక్ అనే వ్యక్తి ఈ గొడవను చూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో.. ఓ బుల్లెట్ దూసుకొచ్చి ఆయనకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడని సమాచారం. ఇటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హరియాణా, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ బంద్ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ జరపడంతో పలువురు గాయపడ్డారు. -
భారత్ బంద్: దిగొచ్చిన కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పుపై రివ్యూకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది. ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మేం సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేశాం. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించనున్నారు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం మీడియాకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కులం ఆధారంగా అమాయకులను వేధించేందుకు ఉపయోగించరాదని పేర్కొంటూ.. ఈ చట్టం అమలు విషయంలో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత నెల 20న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు సోమవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం బలహీనపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 ప్రకారం.. వేధింపుల ఘటనల్లో అరెస్టులు, కేసు నమోదు వెనువెంటనే జరగాల్సి ఉంటుంది. కానీ, తక్షణ అరెస్టులు, కేసుల నమోదు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఫలితంగా బలహీన వర్గాలకు రక్షణగా నిలిచేందుకు ఉద్దేశించిన ఈ చట్టం నిరుపయోగంగా మారుతుందనీ, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు పెరుగుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు తెలుపింది. అంతేకాకుండా, దళితులు, షెడ్యూల్ తెగల వారికి న్యాయం అందించటంలో తాజా ఉత్తర్వు ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. -
అభివృద్ధి లేదు... సొంత ఎజెండానే!
ప్రభుత్వాల తీరుపై చుక్కా రామయ్య సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీలు, గద్దెనెక్కాక సొంత ఎజెండాలనే తెరపైకి తెస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. దళిత వర్గాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రకటన నిమిత్తం గురువారం ఇక్క డ జరిగిన టీఎస్‌యూటీఎఫ్ సమావేశంలో రామయ్య మాట్లాడా రు. ప్రస్తుతం అసెం బ్లీలో రాజకీయాల భాష మారిపోయిందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా రాజకీయ నాయకులకు తామేమీ తీసిపోలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి... వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పి.మాణిక్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి ప్రకటించారు. టీఎస్‌యూటీఎఫ్‌తో పాటు ఎస్టీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, ఎయిడెడ్, కాంట్రాక్ట్ టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్ తదితర సంఘాలన్నీ మాణిక్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా మద్దతు పలికాయన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి చావ రవి పాల్గొన్నారు. -
నాలెడ్జ్ సెంటర్‌గా సీడీఎస్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆ సంస్థ వ్యవస్థాపకులు మల్లేపల్లి లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: దళిత వర్గాలకు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా నిలిచి, అవసరమైన సమాచారాన్ని అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు భాగ్యరెడ్డి వర్మ స్మారక భవన్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్)ను నాలెడ్జ్ సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. అంబేడ్కర్ రచనలు, దళిత సాహిత్యం, సామాజికాంశాలు, ఇతరత్రా పుస్తకాలతో పూర్తిస్థాయిలో గ్రంథాలయం, ఆడిటోరి యం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా బోరబండలో సీడీఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. సీడీఎస్ లక్ష్యాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై లక్ష్మయ్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ముఖ్యాం శాలు ఆయన మాటల్లోనే... సమాజంలో అణగారిన వర్గాలకు వివిధ రూపాల్లో సహాయ పడేందుకు కార్యక్రమాలను చేపడతాం. ఇప్పటికే సీడీఎస్ ద్వారా వివిధ కార్యక్రమాలను పరిమితంగానే చేపడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న చేయూతతో దానిని పూర్తిస్థాయిలో విస్తరించి, అధికశాతం దళితులకు ప్రయోజనం కలిగించాలన్నదే మా లక్ష్యం. దళితులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఒక రీసెర్చ్, రిసోర్స్, ట్రైనింగ్సెంటర్గా సీడీఎస్‌ను నిలుపుతాం. ఈ కేంద్రానికి వస్తే తమ సమస్యలు, సందేహాలు తీరి, ఏదో ఒక మార్గాంతరం లభిస్తుందనే నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలనేది ధ్యేయం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా యూపీఎస్సీ ద్వారా అందుబాటులో ఉన్న ఎన్నోరకాల ఉద్యోగాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తాం. నిరుద్యోగులు, నిరక్షరాస్యులకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి న్యాయ, వైద్య, ఆరోగ్యపరమైన సలహాలతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తాం. యువతకు నైపుణ్యాల మెరుగుదల.. శిక్షణకు వచ్చే వారికి రెసిడెన్షియల్ పద్ధతిలో సౌకర్యాలు కల్పన.. అంబేడ్కర్ జీవి తం, సాహిత్యం పై తరగతులు, ముఖ్యమైన అం శాలపై పుస్తకాల ముద్రణ, పత్రికలు తీసుకొస్తాం. పథకాలపై అవగాహన... దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు తెలిపి, వాటి అమల్లో విధానపరమైన లోపాలు, లోటుపాట్లపై అధ్యయనం జరుపుతాం. వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతాం. దళితులకు 3ఎకరాల పంపి ణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల వల్ల కలిగే ప్రయోజనం, వాటి అమల్లోని లోపాలపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం. దళితుల జీవితాల్లోని అన్ని పార్శ్వాలను తడిమి, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు మా వంతు కృషి చేస్తాం. -
గందరగోళం
2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీలకు నామమాత్రంగా అందిన రుణాలు కడప రూరల్ : జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత వర్గాలకు అందాల్సిన రుణాల పరిస్థితి దారుణంగా తయారైంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలు నామమాత్రంగానైనా పూర్తికాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక రుణ ప్రణాళిక లక్ష్యాలను కేటాయించి గందరగోళంలో పడేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం 1284 యూనిట్లను 2437 మంది అర్హులకు అందజేయాలని, అందుకోసం మొత్తం రూ.11.23కోట్లు సబ్సిడీని కేటాయించాలనే లక్ష్యాలను విధించింది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి రూ.3.96కోట్ల సబ్సిడీ రావడంతో కేవలం 565 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నాటి ప్రభుత్వం లక్ష్యాలు, సబ్సిడీలను ఆర్భాటంగా కేటాయించింది. అంతలోనే ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ రుణాల పరిస్థితి అలాగే ఉండిపోయింది. అయితే ఇంతవరకు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన లబ్ధిదారుల సబ్సిడీ కేటాయింపుల గురించి ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. 2014-15కు కొత్త లక్ష్యాలు ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌కు కొత్తగా తాత్కాలిక రుణ ప్రణాళికలను నిర్దేశించింది. ఆ మేరకు 2303 యూనిట్లను 2545 మంది లబ్ధిదారుల రుణాలకు రూ.12.73 కోట్ల సబ్సిడీ లక్ష్యాలను నిర్దేశించింది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను వెలువరించలేదు. కేవలం యూనిట్లు, లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం అర్హులకు ఏ యూనిట్లను అందజేస్తే బాగుంటుందో ప్రణాళికలు రూపొందించాలని ఆ శాఖను ఆదేశించింది. ఆ మేరకు అధికారులు పథకాలను సిద్ధం చేశారు. 2013-14కు సంబంధించిన రుణ లక్ష్యాలు పూర్తికాకపోవడం, అంతలోనే 2014-15 సంవత్సరానికి ప్రభుత్వం తాత్కాలిక రుణ ప్రణాళికను కేటాయించడం అయోమయానికి గురిచేసింది. 2013-14లో నాటి ప్రభుత్వం రుణాల మంజూరు కోసం డిసెంబర్ 31వ తేదీన 101 జీఓను తెచ్చింది. ఆ జీఓ ప్రకారం అర్హత సాధించడానికి లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. ఎలాగోలా బ్యాంకుల నుంచి రుణ మంజూరు పత్రాలను తెప్పించుకొని రుణాలకు అన్ని అర్హతలను సాధించారు. అయితే సబ్సిడీ నిధులు మంజూరుకాకపోవడంతో నామమాత్రంగా అర్హులు లబ్ధి పొందారు. ఇక 2014-15కు ప్రభుత్వం తాత్కాలిక రుణ ప్రణాళికను నిర్దేశించింది. అదే తరుణంలో ప్రభుత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో మిగిలిన లబ్ధిదారుల రుణాల గురించి ఎలాంటి సమాచారం ఇంతవరకు తెలుపలేదు. తాజాగా నిర్దేశించిన తాత్కాలిక రుణ ప్రణాళిక గురించి కూడా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఏవిధంగా స్పందించి అర్హులైన దళిత వర్గాలను ఆదుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.