ఫ్లెక్సీలు బంద్
► హోర్డింగులకే పరిమితం
►నేటినుంచి పక్కాగా అమలు
► పటిష్టంగా ప్లాస్టిక్ నిషేధం
► నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
►ప్రత్యామ్నాయం చూపండి
►ఫ్లెక్సీ నిర్వాహకుల విజ్ఞప్తి
రహదారులకు అడ్డుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తేలా కట్టే ఫ్లెక్షీలు ఇకనుంచి కనిపించవు. తమ నేత వస్తున్నాడని రాజకీయ పార్టీలు, నాయకుడొస్తున్నాడని వివిధ సంఘాల నాయకులు పట్టణాలు, ఊళ్లను ఫ్లెక్సీలతో కుమ్మేయడం ఈ కొత్త సంవత్సరం నుంచి కుదరదు. ఫ్లెక్షీల ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఫ్లెక్సీలను నిషేధిస్తూ (హోర్డింగ్‌లకు మినహా) గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అంటే.. ఆదివారం నుంచి మంత్రి ఆదేశాలు పక్కాగా అమలులోకి రానున్నాయి. – సాక్షి, సిరిసిల్ల
సాక్షి, సిరిసిల్ల :
పర్యావరణానికి హానికరంగా మారిన ప్లాస్టిక్‌ను తరిమివేసే క్రమంలో ఫ్లెక్షీలనూ నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం మున్సిపల్ అనుమతులున్న హోర్డింగ్‌లు, సైన్ బోర్డులకు తప్ప ఫ్లెక్షీలు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించారు. సిరిసిల్ల పట్టణంలో 12, వేములవాడలో 4 హోర్డింగ్‌లకు మాత్రమే మున్సిపాల్టీల అనుమతి ఉంది. ఫ్లెక్సీల తయారీపై నిషేధిం విధించకున్నా .. హోర్డింగ్‌లు తప్ప బయట ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామనే అధికారుల హెచ్చరికతో దాదాపు నిషేధం అమలు కానుంది.
పటిష్టంగా ప్లాస్టిక్‌పై నిషేధం
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్లాస్టిక్‌రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు నడుం కట్టా రు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో ప్లాస్టిక్, ఫ్లెక్షీల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగిస్తుండగా, నూతన సంవత్సరంలో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు నేతృత్వంలో ఎన్విరాన్ మెంట్ ఇంజినీరింగ్, శానిటరీ ఇన్ స్పెక్టర్, సంబంధిత వార్డు జవాన్, ఇద్దరు వర్కర్లతో కూడిన బృందం నిషేధం అమలు ఉల్లంఘించేవారిపై దాడులు చేపడుతోంది. గత మూడు నెలల్లో 12 సార్లు చేసిన దాడుల్లో రూ.1.10 లక్షల జరిమానాను వ్యాపారుల నుంచి వసూలు చేశారు. ప్లాస్టిక్ కవర్స్, గ్లాస్‌లు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడిన దుకాణదారుకు రూ.2 వేలు, రెండోసారి పట్టుబడితే అదనంగా రూ.వేయి కలిపి జరిమానా విధిస్తారు. మూడు, నాలుగో సారైతే లైసెన్స్ రద్దు చేస్తారు. వేములవాడలోనూ పలు పర్యాయాలు తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల స్థానంలో నాన్ వోవెన్ క్లాత్ బ్యాగ్స్‌ను మాత్రమే అనుమతినిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా ప్రచారం..
పా్లస్టిక్ రహిత సమాజం వైపు అడుగులు వేయాలంటే ప్రజలు, వ్యాపారుల సహకారం అత్యవసరమని గుర్తిం చిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రణాళి కాబద్ధంగా ప్లాస్టిక్ నిషేధానికి విస్తృత ప్రచారం కల్పిం చేందుకు కొత్త సంవత్సరం మొదటి వారంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాల్లో ర్యాలీలు, పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, వ్యాపార, వాణి జ్య వర్గాలతో సమావేశాలు, ఆటోలకు మైక్‌ల ద్వారా కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు.
ప్రత్యామ్నయం చూపండి..
ఫ్లెక్షీలపై నిషేధాన్ని అమలు చేస్తుండడంపై నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్షీల తయారీపై నిషేధం లేకున్నా.. అనుమతున్న హోర్డింగ్‌లు మిన హా ఇతర ప్రాంతాల్లో నిషేధించడంతో తమ వ్యాపారం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని, అప్పులు తెచ్చి ఫ్లెక్షీ వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంలా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఫ్లెక్షీ దుకాణాలు సిరిసిల్లలో ఆరు, వేములవాడలో రెండు ఉన్నాయి. ఫ్లెక్షీలను నిషేధించడం సరికాదని, దీని వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని నిర్వాహకులు భిక్షపతి, మాదాసు రమేశ్ ఆవేదన చెందారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వంద కుటుంబాలపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని వారు కోరారు.
ఇక ప్లాస్టిక్, ఫ్లెక్షీ రహితం
పా్లస్టిక్, ఫ్లెక్షీ రహిత పట్టణంగా సిరిసిల్లను ప్రకటించాం. రాజకీయ పార్టీలు, మత, విద్యా, వ్యాపార సంస్థలు, సహకార, విద్యార్థి సంఘాలు, వ్యక్తులు ఎవరూ కూడా ఆదివారం నుంచి చౌరస్తాలు, ఎక్కడైనా ఫ్లెక్షీలు కట్టడం, ప్రదర్శించడం చేయరాదు. చనిపోయిన వారి చిత్రాలు, ఫొటలతో కూడిన ఫ్లెక్షీలు కూడా పెట్టొద్దు. వ్యాపారసంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్, పాలిథిన్ క్యారీ బ్యాగులు అమ్మడం, వాడడం చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధింస్తాం. నూతన సంవత్సరంలో వందశాతం ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం. ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారాన్ని విస్తృతం చేశాం. ప్రజలు, వ్యాపారులు కూడా ఇందుకు సహకరించాలి. – బడుగు సుమన్ రావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్