
సోనియాకు ఏమైంది..? యూపీలో కలకలం
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధించి ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపాయి. సోనియా, ఆమె కుమార్తె ప్రియంకా గాంధీ చిత్రాలను ముద్రించిన హోర్డింగ్లపై 'తల్లి అనారోగ్యంతో ఉన్నారు. అన్న బరువుకు మించిన బాధ్యతలు మోస్తున్నారు. ప్రియాంక పూల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు' అని రాశారు. పూల్పూర్ నుంచి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించారు.
హోర్డింగ్ల విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంబంధిత నాయకులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. జిల్లా సెక్రటరీ హసీబ్ అహ్మద్ మరో నాయకుడు శ్రీష్ చంద్ర దూబేను బాధ్యులుగా పేర్కొన్నారు. 'సోనియాపై దుష్ప్రచారం చేయడంతో పాటు ప్రియాంకను అనసవరంగా రాజకీయాల్లోకి లాగడంపై పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో రాష్ట్ర శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.