రాయ్‌బరేలీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్నీ అందించిన రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి విచ్చేశారు. సోనియా గాంధీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి రాయ్‌బరేలీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం ఫర్‌సాత్ గంజ్ విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, ప్రియాంక అక్కడి నుంచి భుయేము అతిథి గృహానికి వెళ్లారని రాయ్‌బరేలీ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్‌కృష్ణ ప్రతాప్ తెలిపారు. అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రియాంక గాంధీ సమీక్ష నిర్వహించనున్నారని చెప్పారు. ఆహ్వానించిన 2,500 మంది పార్టీ కార్యకర్తలతో సాయంత్రం జరిగే కృతజ్ఞత సమావేశంలో సోనియా, ప్రియాంక పాల్గొంటారని వెల్లడించారు.
ఇటివల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న రాయ్‌బరేలీలో సోనియా గాంధీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై సోనియా 1, 67,178 మెజార్టీతో గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోనియా ఇదే నియోజకవర్గంలో 3,52,713 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అజయ్ అగర్వాల్‌పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment