కేజేరెడ్డి హోర్డింగ్‌లు తొలగించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి ప్రచార హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కే.ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపల్ స్థలాల్లో ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్‌లను పెట్టినా తొలగించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు వర్తించావా అని వారు ప్రశ్నించారు. జిల్లా అధికార యంత్రాంగం బరితెగించి టీడీపీ అభ్యర్థికి సహకారం అందిస్తున్నాయని, వెంటనే హోర్డింగ్‌లను తొలగించకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గురువారం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. నిబంధనలు ప్రకారం పట్టభద్రులకు 2013 ఆక్టోబర్‌లోపు డిగ్రీ పాసైనా వారికే ఓటు హక్కును కల్పించాలని, అయితే 2016లో డిగ్రీ పాసైనా వారికి కూడా ఓటు ఉందన్నారు. కర్నూలులో కొన్ని కేంద్రాల్లో కేవలం 150 మంది మాత్రమే ఓటేసేవిధంగా కేంద్రాలు ఉండగా..గ్రామీణ ప్రాంతాల్లో 2500 మందికి ఒక్క పోలింగ్ బూతును ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లాలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోందని, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముళ్లు మాఫీగా ఏర్పడి జిల్లాలోని తుంగభద్ర, హంద్రీ, హగరి నదుల ఇసుకను కొల్లగొట్టి కోట్లను గడిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు పాల్గొన్నారు.