కోడ్‌కు విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు  | Do Not Allow Political Campaigning That Is Against The Code Ahead Of Elections, Details Inside - Sakshi
Sakshi News home page

కోడ్‌కు విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు 

Published Wed, Mar 20 2024 4:42 AM | Last Updated on Wed, Mar 20 2024 12:53 PM

Do not allow political campaigning that is against the Code - Sakshi

ప్రభుత్వ వాణిజ్య స్థలాల్లో రాజకీయ హోర్డింగులను ఏర్పాటు చేయకూడదు.. రోడ్డు పక్కనున్న హోర్డింగ్‌లను అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా కేటాయించాలి 

ప్రైవేటు భవనాలపై వాల్‌ పెయింట్స్‌కు అనుమతిలేదు, ఉన్నవాటిని చెరిపించేయాలి 

సి విజిల్‌ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి 

జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఆదేశం   

సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతులను మాత్రం ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ఆయన సమీక్షించారు.
 
ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యా­నర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం  మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎటువంటి రా­జకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు.  

సరిహద్దుల్లో లిక్కర్‌ రవాణాను నియంత్రించాలి 
ప్రైవేటు భవనాలపై వాల్‌ పెయింట్లకు ఎటువంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో  ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించాలని, ఏమాత్రం దృఢత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి లిక్కర్, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్‌ పోస్టులు ఉన్న చోట వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాలు పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, అటు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.  

ఎన్నికల ప్రణాళికలు వెంటనే ఇవ్వాలి 
సి విజిల్‌ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో నూరు శాతం పరిష్కరించాలని, ఎలక్ట్రానిక్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌  ఏజన్సీలపై ఒత్తిడి పెంచాలని మీనా అన్నారు. ఇంకా కొన్ని జిల్లాల నుంచి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు అందలేదని, వాటిని వెంటనే తమకు అందజేయాలని ఆదేశించారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోపే ఎన్నికల సిబ్బందికి మరోసారి లేదా రెండు సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావే­శంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు  అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్‌.ఎన్‌.హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement