
పోలీసులు శివసేన హోర్డింగులు పీకేశారు
ముంబయి: ముంబయి పోలీసులు శివసేన పార్టీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను, హోర్డింగ్లను పీకేశారు. ప్రధాని నరేంద్రమోదీని కించపరిచేలా, ఎత్తిపొడిచేలా అవి ఉండటంతో వాటిని తొలగించారు. ఆ ఫ్లెక్సీల కారణంగా బీజేపీ, శివసేన పార్టీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య వివాదం తలెత్తి శాంతిభద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగించినట్లు పోలీసులు తెలిపారు. శివసేన భాగస్వామ్యంతో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే, గత కొద్ది రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య అస్సలు పొసగడం లేదు. ఆ పార్టీకి చెందిన నాయకులు ఎదురెదురుపడకముందే తూటాల్లాంటి మాటలు పేల్చుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నంత పరిస్థితి ఆ రెండు పార్టీల మధ్య నిశ్శబ్దంగా కొనసాగుతుంది. దసరా పండుగ నేపథ్యంలో నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా శివసేన ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఒకప్పుడు శివసేన అధినేత బాల్ ఠాక్రే ముందు నేటి ప్రధాని నరేంద్రమోదీ తలవొంచి నవ్వుతూ నమస్కరిస్తున్న ఫొటోలు ఉంచారు.
'నాటి రోజులు అప్పుడే మర్చిపోయావా? మీలాంటి గర్విష్టులంతా ఠాక్రే పాదాల ముందు తలవంచినప్పటి రోజులు మీరంతా మర్చిపోయారా?' అంటూ వ్యాఖ్యలు పెట్టారు. వాజపేయి, ఎల్ కే అద్వానీ, రాజనాథ్ సింగ్ వీళ్లంతా ఒకప్పుడు ఠాక్రే పాదాల ముందు మోకరిల్లినవారే అన్నట్లుగా ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు పెట్టారు. దీంతో ఇవి రెండు పార్టీల మధ్య పెను ధుమారం రేపే అవకాశం ఉన్నందున పోలీసులు వాటిని తొలగించారు.