వీరింతే..
అధికారిక లెక్కల మేరకు అనుమతి పొందిన హోర్డింగులు: 2425
అధికారిక లెక్కల మేరకు అనుమతి లేనివి: 300
ఒక అంచనా మేరకు అనుమతి లేని హోర్డింగులు: 1500
అనుమతి లేని ఫ్లెక్సీలు, ఇతరత్రా : 10, 000
ప్రాణాంతకంగా మారుతున్న హోర్డింగ్‌లు
అనుమతి లేకుండా ఏర్పాటు
పట్టించుకోని అధికార గణం
హైకోర్టు ఆదేశించినా స్పందన అంతంతే
మృత్యువు చేతులు చాచినట్టు దారి పొడవునా అనుమతి లేని హోర్డింగులు వేలాడుతున్నాయి. అధికారుల కళ్ల ముందే ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలూ పోగొట్టుకున్నారు. ‘అయ్యో’ అనడమే తప్ప... అక్రమాన్ని అరికట్టాలని మన యంత్రాంగానికి అనిపించడం లేదు. న్యాయస్థానం చెబితే పట్టించుకుంటారనుకుంటే... తమదైన శైలిలో లెక్కలతో మాయ చేశారు. మరోసారి స్పందించిన న్యాయస్థానం అదే విషయాన్ని గుర్తు చేసింది. ఇదంతా తమకు అలవాటే అన్నట్టుగా ‘కదులుతున్నట్టు’ నటిస్తున్నారు. అవి మాత్రం అలాగే ఉన్నాయి.
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో అడుగడుగునా వేలాడుతున్న అనుమతి లేని హోర్డింగులు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ బ్యానర్లు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. ప్రమాణాలు పాటించకపోవడంతో ఎప్పటికప్పుడు కింద పడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది వీటి కారణంగా గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలూ కోల్పోయారు. వీటిని తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ, అమలు చేసే వారే కనిపించడం లేదు. కనీసం కొత్తవి పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నమూ చేయడం లేదు. రాజకీయ హోర్డింగులకు 24 గంటల వరకే ప్రత్యేక అనుమతులిస్తుండగా... నెలల తరబడి తొలగించడం లేదు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్రమ హోర్డింగులను తొల గిస్తున్నామని చెబుతున్నప్పటికీ అమలులో కనిపించడం లేదు. తాజాగా రెండు వారాల క్రితం హైకోర్టు మరోసారి వీటిపై స్పం దించింది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయినా అధికారులు స్పందించలేదు. హోర్డిం గులకు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉన్నట్లు సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాల్సి ఉంది. ఈ విషయాన్నీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక రాజకీయ సభలు ఉంటే ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పా టు చేస్తున్న వారు వెంటనే వాటిని తొలగించడం లేరు.
దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలింగా ఏర్పాటు చేస్తున్న అక్రమ హోర్డింగులను తొలగించాల్సిందిగా హైకోర్టు గతంలో ఆదేశించింది. వాటిని తొలగించడంతో పాటు నిర్ణీత వ్యవధిలోగా నివేదిక అందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. దీనిపై స్పందించిన అధికారులు దాదాపు 750 అక్రమ హోర్డింగులు ఉన్నాయని... వాటిలో 600కు పైగా తొలగించామని... మిగిలినవి తొలగిస్తున్నామని అప్పట్లో నివేదించారు. ఆ తర్వాత ఆ సంగతే మరచిపోయారు. ఇటీవల మరోసారి హైకోర్టు ఆదేశించడంతో తిరిగి చర్యలకు సిద్ధమవుతున్నారు. సర్కిళ్ల వారీగా అక్రమ హోర్డింగులను గుర్తించి, వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిం చారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ పనులు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని హోర్డింగులు ఏ క్షణాన ఎవరిపై పడతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. దాదాపు 2500 అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా... వాస్తవంగా ఈ సంఖ్య అంతకు రెట్టింపే ఉంటుందని అంచనా. అక్రమ హోర్డింగుల విషయమై జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ వద్ద గురువారం ప్రస్తావించగా, వీటిని తొలగించామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే తొలగిస్తామన్నారు. వాటిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.