హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
హైదరాబాద్ : హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది ఎంఎస్ఎన్ ప్రసాద్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ..ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది.
అలాగే ఏపీ, తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది. రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే.