హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో అక్రమ హోర్డింగులు, యూనిపోల్స్ తదితర వ్యాపార ప్రకటనలకు సంబంధించిన బోర్డుల తొలగింపు కాగితాల్లో తప్ప కార్యాచరణకు నోచుకోవడం లేదు. గ్రేటర్ నగరంలో రెండువేలకు పైగా ఉన్న ఇలాంటి వాటిని తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ ప్రకటించి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటిని తొలగించేందుకు గతంలో సైతం రెండు మూడు పర్యాయాలు టెండర్లు ఆహ్వానించినప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో పనులు జరగలేదు. భవనాల రూఫ్‌టాప్‌లు తదితర ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులను యజమానులే తొలగించాల్సిందిగా ఆదేశించింది.
అయినా ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేక, ఇక తామే తొలగించేందుకు యంత్రాంగం సిద్ధమై టెండర్లు పిలిచినా ఏజెన్సీలు ముందుకు రాలేదు. టెండరు నిబంధనల మేరకు హోర్డింగులతో పాటు యూనిపోల్స్, బస్‌షెల్టర్స్,గ్లో సైన్ బోర్డులు, ఇతరత్రా వ్యాపార ప్రకటనలన్నీ తొలగించే బాధ్యత ఏజెన్సీలదే. ఇందుకోసం ఏజెన్సీలకు జీహెచ్‌ఎంసీ చెల్లించేదేమీ లేదు. జీహెచ్‌ఎంసీకే అవి చెల్లించాలి. అందుకే ఏజెన్సీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఇదంతా నిబంధనాలతోనే..
► హోర్డింగులను తొలగించడంతో వెలువడే ఐరన్, స్క్రాప్ ఏజెన్సీ తీసుకోవాలి. ఇందుకోసం టన్నుకు ఇంత అనే రేటు వంతున జీహెచ్‌ఎంసీకి చెల్లించాలి. అలా జీహెచ్‌ఎంసీకి ఎక్కువ రేట్ (హెచ్1) ఇచ్చేందుకు ముందుకొచ్చే ఏజెన్సీలకు హోర్డింగులను తొలగించే టెండరు ఖరారు చేస్తుంది. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో ఎన్ని హోర్డింగులున్నాయో, వాటిని తొలగించడం ద్వారా రాగల ఆదాయమెంతో తదితరాలను ఏజెన్సీలే అంచనా వేసుకొని టెండరులో పాల్గొనాలి. తొలగించేందుకు అనువైన పరిస్థితులున్నదీ, లేనిదీ చూసుకోవాలి. అవన్నీ చూసుకొని తొలగించే బాధ్యత ఏజెన్సీలదే.
► తొలగింపు సందర్భంగా ఎదురయ్యే సమస్యలు సైతం ఏజెన్సీలే పరిష్కరించుకోవాలి. జీహెచ్‌ఎంసీ సహకరించదు. ఇలాంటి నిబంధనలుండటం వల్లే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడం లేదని పలువురు భావిస్తున్నారు. దీంతో, జీహెచ్‌ఎంసీ కాగితాల్లో చూపేందుకు మాత్రమే ఈ టెండర్లు ఆహ్వానిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోర్డింగుల తొలగింపు పనులను ఏజెన్సీలకు కాంట్రాక్టుకిచ్చే బదులు జీహెచ్‌ఎంసీయే చేపడితే పనులు జరగవచ్చని, ఇప్పటికై నా జీహెచ్‌ఎంసీ ఆ పని చేయాలని, నిబంధనలు మార్చకుండా కేవలం టెండర్లు ఆహ్వానించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment