యూపీలో హోర్డింగుల కలకలం
మీరట్: జమ్మూకశ్మీర్ లో సైనికులపై దాడులను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పెట్టిన హోర్డింగులు కలకలం రేపుతున్నాయి. కశ్మీరీలు తమ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని పేర్కొంటూ ఢిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై హోర్డింగులు పెట్టారు. సైన్యంపై కశ్మీరీల రాళ్లు రువ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ హోర్డింగులు ఏర్పాటు చేసినట్టు ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన అధ్యక్షుడు అమిత్ జానీ తెలిపారు. కశ్మీర్ విద్యార్థులు ఎక్కువగా ఉండే కాలేజీలకు సమీప ప్రాంతాల్లో దాదాపు 48 హోర్డింగులు పెట్టినున్నట్టు తెలిపారు. తమ నిరసనలో భాగంగా కశ్మీర్ విద్యార్థులకు ఆహారం, నీరు, నివాసం నిరాకరించాలని యూపీ ప్రజలను నవనిర్మాణ సేన కార్యకర్తలు కోరతారని చెప్పారు.
‘కశ్మీర్ లో ప్రతి రోజు భారత సైనికులపై కశ్మీరీలు రాళ్లు రువ్వుతున్నారు. మీరట్ లో నేను చాలా మంది విద్యార్థులతో మాట్లాడాను. ఇక్కడ చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులు జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించడం లేదని తెలుసుకున్నాను. ఇక్కడ చదువుకుంటున్న, పనిచేస్తున్న కశ్మీరీలు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిపై నిషేధం విధించాలని యూపీ ప్రజలను చైతన్య పరుస్తాం. పాలు, నీళ్లు, న్యూస్ పేపర్లు, అద్దెకు ఇళ్లు ఇవ్వొద్దని కోరతాం. జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఖాతాలు మూసివేయాలని ఖాతాదారులకు చెబుతాం. మా రాష్ట్రంలో ఉన్న కశ్మీరీలందరూ తిరిగి వెళ్లిపోవాలి. వారు వెళ్లకపోతే ఏప్రిల్ 30 నుంచి ధర్నాలు, ఆందోళన చేపడతామ’ని అమిత్ జానీ పేర్కొన్నారు.