బద్ధకమానిర్లక్ష్యమా | people have neglect in using their vote right | Sakshi
Sakshi News home page

బద్ధకమానిర్లక్ష్యమా

Published Sat, May 3 2014 2:07 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

people have neglect in using their vote right

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 18,52,970 మంది ఓటర్లున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 13,25,045 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 5,27,925 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న మాట.

 జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో మేజర్ పంచాయతీలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. జిల్లాలో విద్యావంతులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువ మంది పోలింగ్‌కు దూరంగా ఉంటుండడంపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. 90 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలన్న లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నో చర్యలు తీసుకుంది.

 ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఓటర్లను చైతన్యవంతం చేయడానికి కమిటీలను నియమించింది. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కళాబృందాలను రంగంలోకి దింపింది. మైకుల ద్వారా సైతం ప్రచారం చేపట్టింది. ఇంటింటికి అధికారులే వెళ్లి పోల్ చీటీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. అయినా బద్ధకస్తులు కదల్లేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో పోలింగ్ శాతం 2 శాతానికి మించి పెరగలేదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మరీ దారుణంగా 52.02 శాతమే పోలింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అర్బన్‌లో కాస్త పోలింగ్ శాతం పెరగడం మాత్రమే అధికారులకు ఉపశమనం ఇచ్చింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 39 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 43 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 గ్రామాల్లోనే చైతన్యం
 పట్టణ ప్రాంతాల్లోని వారు పోలింగ్‌కు దూరంగా ఉండగా.. గ్రామీణులు మాత్రం ఎండను లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా భారీ క్యూ కనిపించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 78.86 శాతం పోలింగ్ నమోదు కాగా.. బాన్సువాడలో 76.76, జుక్కల్‌లో 76.46, బోధన్‌లో 75.44 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement