
న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌కు అలహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు పాల్పడిన వారి ఫోటోలు, చిరునామాలతో కూడిన షేమ్ హోర్డింగ్‌లను తొలగించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 16లోగా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని జిల్లా మేజిస్ర్టేట్, పోలీస్ కమిషనర్‌లను కోర్టు ఆదేశించింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న వారి ఫోటోలు, చిరునామాలతో యూపీ ప్రభుత్వం గత వారం లక్నోలోని పలు ప్రాంతాల్లో ఆరు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.
డిసెంబర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 మంది ఫోటోలు, వారి వివరాలతో ఈ హోర్డింగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. షియా గురువు మౌలానా సైఫ్ అబ్బాస్, మాజీ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి, కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ వంటి పలువురి వివరాలను ఈ హోర్డింగ్‌ల్లో పొందుపరిచారు. ఆస్తులను ధ్వంసం చేసిన వీరంతా పరిహారం చెల్లించాలని లేకుంటే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిందితులకు ఈ మేరకు ఆస్తుల అటాచ్‌కు సంబంధించిన నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించిన హైకోర్టు నిరసనకారుల ఫోటోలను ప్రదర్శించడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వ చర్య పౌరుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవడమేనని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment