హోర్డింగ్‌ పిడుగు! | Hoardings create a problems in city | Sakshi
Sakshi News home page

హోర్డింగ్‌ పిడుగు!

Published Wed, Mar 22 2017 12:51 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

హోర్డింగ్‌ పిడుగు! - Sakshi

హోర్డింగ్‌ పిడుగు!

సిటీబ్యూరో : 2016 మే నెల.. అకస్మాత్తుగా ఈదురు గాలుల పెను ప్రళయం...గాలి వాన బీభత్సంతో నగరం అతలాకుతలమైంది. భారీ చెట్లు ఫెళఫెళమంటూ నేలకూలాయి. పెద్ద పెద్ద హోర్డింగులు, విద్యుత్‌స్తంభాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గంటకు 100 నుంచి 150 కి.మీ. వేగంతో వీచిన ప్రళయ గాలులతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఏ హోర్డింగు వచ్చి ఇంటిమీద పడుతుందోనని భయం. బయటకు వెళితే ఏచెట్టు కూలి నెత్తిన పడుతుందోననే ఆందోళనతో అల్లాడిపోయారు. ఒక్కసారి కాదు.. గతేడాది మేలో మూడు  పర్యాయాలు ఇదే రకమైన భయంకర పరిస్థితి తలెత్తింది. ఇది గతం... .....మరి ఈ సంవత్సరం సైతం అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా? నగర వాసులను వేధిస్తున్న ప్రశ్న ఇది.

వాస్తవంగా అలాంటి భీతావహ పరిస్థితి ఏనెలలో వస్తుందో.. ఎంత తీవ్రతతో వస్తుందో ముందస్తుగానే తెలియజేసే యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం మనకు లేవు. నగరంలో ఇప్పటికే  అడపాదడపా ఈదురుగాలులు మొదలయ్యాయి. గత అనుభవంతోనైనా జీహెచ్‌ఎంసీ తగిన ముందస్తు చర్యలు చేపట్టిందా అంటే.. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి  ఇటీవల ఒక సమావేశం నిర్వహించినప్పటికీ, స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. ఉన్నట్లుండి మళ్లీ గాలివీస్తే .. ప్రజల ప్రాణాలకు గ్యారంటీలేదు.  

నియంత్రణ ఏదీ?
గత సంవత్సరం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో యూనిపోల్‌ కూలి పలు కార్లు ధ్వంసమైన నేపథ్యంలో హోర్డింగులు, యూనిపోల్స్, సెల్‌టవర్లు ప్రమాదవశాత్తు కూలితే వాటిని ఏర్పాటుచేసిన సంస్థలపై సివిల్,  క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. దాదాపు నాలుగునెలలపాటు  హోర్డింగులను పూర్తిగా తొలగించారు. హోర్డింగులు, సెల్‌టవర్ల సామర్ధ్యమెంత.. ఎంత గాలిని తట్టుకోగలవు.. తదితరమైనవి బేరీజు వేసి తగిన స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ ఉంటేనే అనుమతులిస్తామని ప్రకటించారు. 100–150 కి.మీ.ల మేర గాలి వేగాన్ని తట్టుకునేలా డిజైన్‌ చేయాలని నిర్ణయించారు. రెండంతస్తులకు మించిన భవ

నాలపై ఏర్పాటు చేసే హోర్డింగులు, 40  25 అడుగుల కంటే మించిన హోర్డింగులను ఏర్పాటు చేసేందుకు ముందే జేఎన్‌టీయూ నిపుణులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ధ్రువీకరిస్తేనే అనుమతులిస్తామని స్పష్టం చేశారు. అంతకంటే తక్కువ సైజులోని వాటికి  2017 మార్చి(ఈనెలాఖరు) లోగా స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ, డిజైన్లకు సంబంధించి పూర్తిస్థాయి జాగ్రత్తచర్యలు చేపట్టాలని, వాటిని సైతం జేఎన్‌టీయు లేదా ఐఐటీ  నిపుణులు ఆమోదించాలని పేర్కొన్నారు. ఆ మేరకు పాలసీని రూపొందించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అమలు మాత్రం సాధ్యం కాలేదు. హోర్డింగ్‌ల నిర్వాహకులు కొందరు హైకోర్టుకు వెళ్లి  హోర్డింగులపై స్టే తెచ్చుకున్నారు. హోర్డింగుల ఏర్పాటుకు ఫీజు తీసుకున్నాక ఎలా తొలగిస్తారంటూ కోర్టు స్టే ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీ ఏమీ చేయలేకపోయింది. ఈ మార్చి నెలాఖరుతో ఫీజు గడువు ముగిసిపోనుంది. ఏప్రిల్‌ నుంచైనా కొత్త పాలసీని అమలు చేస్తుందో, లేదో వేచిచూడాల్సిందే.  

అడ్డగోలు హోర్డింగ్‌లు...
గతంలో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా మాత్రమే స్ట్రక్చరల్‌ స్టెబిలిటీని పరిగణనలోకి తీసుకునేవారు. 150 కి.మీ.ల వేగంతో గత సంవత్సరం మాదిరిగా మళ్లీ గాలులు వీస్తే ఎన్నో హోర్డింగులు కూలే ప్రమాదం ఉంది. కోర్టు స్టే వారాలకు వారాలుగా పొడిగింపు అవుతోంది. దీనిపై కూడా తగిన విధంగా వ్యవహరించడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైందనే చెప్పాలి. కోర్టు స్టే సాకుతో అడ్డగోలుగా, ఎన్ని అక్రమ హోర్డింగులు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గత సంవత్సరం ప్రమాదం జరిగినప్పుడు జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ డా.ఎన్‌.వి.రమణారావు నేతృత్వంలోని కమిటీ హోర్డింగుల ఏర్పాటుపై నిబంధనలు విధిస్తూ పలు సిఫార్సులు చేసింది. అందుకనుగుణంగా పాలసీ రూపొందించినప్పటికీ కోర్టు స్టేతో పట్టించుకోవడం లేదు.

ఉత్తుత్తి తనిఖీలే...
జీహెచ్‌ఎంసీలో 2,684 హోర్డింగులు, యూనిపోల్స్‌కు, 1151 బస్‌షెల్టర్లకు, 6 ఎఫ్‌ఓబీలపై మాత్రమే ప్రకటనలకు అనుమతి ఉందని జీహెచ్‌ఎంసీ గత సంవత్సరం స్పష్టం చేసింది. జేఎన్‌టీయూ మార్గదర్శకాల అనంతరం 1125  హోర్డింగులకు సంబంధించి నిర్వాహకులు స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్లను సమర్పించగా,అనుమతులిచ్చినట్లు పేర్కొంది. అనంతరం సర్కిల్‌స్థాయిలో 972 హోర్డింగులను తనిఖీ చేయగా, వాటిల్లో 83 హోర్డింగులు అక్రమమైనవిగా గుర్తించారు. ప్రధాన కార్యాలయంలోని ప్రకటనల విభాగానికి చెందిన ఇంజినీర్లతో కూడిన మరో బృందం 894 హోర్డింగులను తనిఖీ చేయగా, వాటిల్లో 41 హోర్డింగుల్ని అక్రమంగా గుర్తించారు. మొత్తం తనిఖీలు పూర్తిచేసి అనుమతుల్లేనివి కూల్చివేస్తామన్నారు కానీ..ఆ తర్వాత తనిఖీలు మరిచారు.

అమలుకు నోచని సిఫార్సులు..
జేఎన్‌టీయూకు చెందిన ఫ్రొఫెసర్‌  డాక్టర్‌ ఎన్‌.వి.రమణారావు సిఫార్సుల మేరకు స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం తగిన సేఫ్టీ ఉందని భావించిన ప్రదేశాల్లో...ఆ విషయాన్ని జేఎన్‌టీయూకు తెలియజేసి గోడలపై,  భూమిపై  40 ్ఠ 25 అడుగుల వరకు హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. రూఫ్‌ టాప్‌పై ఏర్పాటు చేసేవి రెండంతస్తుల వరకు 30 ఇంటూ 25 అడుగులకు మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఏదేని ప్రమాదం జరిగితే  తమదే పూర్తిబాధ్యత అనే పూచీకత్తుపై తాత్కాలిక అనుమతులివ్వవచ్చు. భద్రత, ప్రజల రక్షణలకు సంబంధించి ఎలాంటి రాజీ లేకుండా పరిశ్రమపై ఆధారపడ్డవారిని దృష్టిలో ఉంచుకొని ఈ సిఫార్సులు చేసినట్లు పేర్కొన్నారు.

వీటికి సంబంధించి ప్రతి అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ వేటికవిగా విడివిడిగా వ్యక్తిగతంగా అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ఉండాలి. ఏదేని అనుకోని ప్రమాదం జరిగితే సంబంధిత ఏజెన్సీయే పూర్తి బాధ్యత వహించాలి. డిజైన్లు, మార్పుచేర్పులకు సంబంధించి చేయాల్సిన పనుల్ని 2017 మార్చినెలాఖరు లోపున పూర్తిచేయాలి. హోర్డింగులపై సింగిల్‌ ఫ్లెక్సీలనే ప్రదర్శించాలి. వీటితోపాటు మరికొన్ని సిఫార్సులు చేశారు. హైకోర్టు స్టే సాకుతో అన్నింటినీ తుంగలో తొక్కారు.

నాటి ప్రళయం.. మరువని నగర జనం..
గత సంవత్సరం గాలివాన బీభత్సానికి మూడువేల చెట్లకు పైగా కూలిపోయాయి. వెయ్యికి పైగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. 60 ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయి. వందల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి.  గత సంవత్సరం అనుభవంతో పెనుగాలికి కూలే కొండతంగేడు మొక్కలను రోడ్ల వెంబడి నాటడం లేదని జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం డైరెక్టర్‌ దామోదర్‌ తెలిపారు. కూలేలా బలహీనంగా ఉన్న చెట్లను కూడా గుర్తించి  గత సంవత్సరమే కూల్చివేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement