ప్రకటనలు జిగేల్.. ఆదాయం దిగాల్!
రిమ్స్ క్యాంపస్:పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య ప్రకటనలను హోర్డింగుల రూపంలో ప్రదర్శిస్తుంటాయి. ఇలా ప్రకటనల హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ఆయా మున్సిపాలిటీలకు నిర్ణీత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రకటనల ద్వారా వసూలయ్యే పన్నులు మున్సిపాలిటీల ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా మారాయి. అయితే ఈ పన్ను వసూళ్లు సక్రమంగా జరగకపోవడంతో రావాల్సినంత ఆదాయం లభించడం లేదు. ఇంకా విడ్డూరమేమిటంటే.. ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి, నీటి పన్నుల వగైరాలను ఠంచనుగా నిర్ణీత కాలపరిమితిలో పెంచుతూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న మున్సిపాలిటీలు ప్రకటనల పన్ను విషయంలో మాత్రం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తున్నాయి.
ఎప్పుడో 14 ఏళ్ల క్రితం నిర్ణయించిన పన్నులే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో పారిశ్రామిక, వాణిజ్య సంస్థలే కాకుండా విద్యాసంస్థలు, సేవా సంస్థలు వంటివి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచార హోర్డింగులనే ఆశ్రయిస్తున్నాయి. ఇటువంటి హోర్డింగుల ఏర్పాటుకు చాలా ఏజెన్సీలు కూడా పని చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు పట్టణాల్లోని ముఖ్యమైన కూడళ్లలో హోర్డింగుల ఏర్పాటుకు మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందుతాయి. అందుకుగాను ఏడాదికోసారి పన్ను రూపంలో ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లిస్తాయి. ప్రకటనకర్తలు ఈ ఏజెన్సీలతో మాట్లాడుకొని తమ హోర్డింగులను ఏర్పాటు చేయించుకుంటారు. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, రాజాం మున్సిపాలిటీల పరిధిలో వందకు పైగా చిన్న పెద్ద ఏజెన్సీలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా మున్సిపాల్టిలకు కోట్లలో అధాయం రావల్సి ఉండగా, కేవలం లక్షల్లో మాత్రమే అధాయం చేకురుతొంది. అంటే ప్రకటనల ద్వారా మున్సిపాలిటీలకు కోట్లలో ఆదాయం రావాల్సి ఉండగా.. లక్షల్లో మాత్రమే వస్తోంది.
ఒకటిన్నర దశాబ్దాలుగా పన్ను పెంపు లేదు
ప్రకటనల హోర్డింగుల రుసుములకు సంబంధించి ఏ సైజుకు ఎంత రేటు తీసుకోవాలన్నది నిర్దేశిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. ఐదారేళ్లకోసారి తాజా పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్లను సవరించాల్సి ఉంటంది. గతంలో1993 నుంచి అమల్లో ఉన్న పన్ను రేట్లను దాదాపు రెట్టింపు చేస్తూ 1998లో ప్రభుత్వం సవరించింది. ఈ రేట్లను 2000 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. సవరణ జరిగి 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ అవే రేట్లు అమలవుతున్నాయి. అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. మున్సిపాలిటీల్లో ఆస్తి, నీటి పన్నులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. అయినా ప్రకటనల పన్ను విషయం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. లెక్క ప్రకారం రెండుసార్లు పన్ను రివిజన్ జరిగి ప్రకటనల పన్ను దాదాపు నాలుగింతలు పెరగాల్సి ఉంది. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న మున్సిపాలిటీలు ప్రకటనల పన్ను ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీనే తీసుకుంటే 2000 నాటి పన్ను రేట్లు వసూలు చేస్తుండటం వల్ల ఏడాదికి రూ.5.20 లక్షల ఆదాయమే సమకూరుతోంది. అదే పన్ను రివిజన్ జరిగి ఉంటే సుమారు రూ.21 లక్షలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారవర్గాలే పేర్కొంటున్నాయి.
అనధికార ప్రటకనలే ఎక్కువ
అధికారిక వాణిజ్య ప్రకటనల పన్ను పెంచకపోవడం వల్ల ఆదాయం కోల్పోతుండటం ఒకెత్తయితే.. ప్రధాన కూడళ్లలో అధికారిక ప్రకటనల కంటే అనధికారిక ప్రకటనలే ఎక్కువ కనిపించడం మరో ఎత్తు. వీటి ద్వారా ఒక్క పైసా కూడా మున్సిపాలిటీకి ఆదాయం రావట్లేదు. ప్రకటనల ఏజెన్సీ ఒక హోర్డింగ్‌ను లీజ్‌కు తీసుకుంటే వాళ్లు ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపార ప్రకటనే హోర్డింగ్‌పై ఉండాలి. దీన్ని అధికారిక ప్రకటనగా గుర్తిస్తారు. అలా కాకుండా ఆ హోర్డింగులతోపాటు ఖాళీగా ఉన్న హోర్డింగులపైనా రాజకీయ పార్టీలు, ఇతరత్రా చిన్నాచితకా సంస్థల ప్రచార పోస్టర్లు కనిపిస్తున్నాయి. అలాగే విద్యుత్ స్తంభాలకు, రోడ్లపై కర్రలు పాతి ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను అనధికారిక ప్రకటనలుగా గుర్తిస్తారు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించడం, సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉన్న మున్సిపల్ అధికారులు అటువంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. దీని వల్ల మున్సిపాలిటీ అదాయం కోల్పోతోంది.