సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘ఈడీ’ వేడి రాజేసింది. అధికార బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తగ్గేదేలే అన్నట్టుగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్‌లో వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్‌కమ్ టూ అమిత్ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే, బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్ పెట్టారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ విచారణ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్నంగా పోస్టర్లతో నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పలు చోట్ల బీజేపీ నేతలకు సంబంధించిన పోస్టర్లు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment