అడ్డగోలుగా హోర్డింగులు
Published Wed, Feb 26 2014 2:42 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
సాక్షి, రాజమండ్రి :సిటీలో రోడ్డుపై నడుస్తూ తల తిప్పితే చాలు.. రంగు రంగుల బొమ్మలతో వందలాది హోర్డింగులు కనిపిస్తుంటాయి. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి వీటిని ఏర్పాటు చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో రాజకీయ నేతల నిలువెత్తు చిత్రాలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఇవన్నీ అనుమతులతో పెట్టారా లేక అడ్డుగోలుగా ఏర్పాటు చేశారా అన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. ప్రస్తుతం ఇదే అనుమానం సాక్షాత్తూ మున్సిపల్ అధికారులకు కూడా కలుగుతోందంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఆదాయం తక్కువగా ఉందన్న కారణంగా మున్సిపాలిటీల్లో హోర్డింగుల ద్వారా వ్యాపార ప్రకటనలకు అనుమతిస్తున్నారు. కార్పొరేట్ ప్రచార సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగుల్లో భాగంగా మన ప్రాంతంలో కూడా పెడుతున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్‌లు పెట్టేస్తున్నారు. ఇలా వివిధ కారణాల నేపథ్యంలో మున్సిపాలిటీల్లో వందలాదిగా హోర్డింగులు వెలుస్తున్నాయి. వీటిని అదుపు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు.
పట్టణాలే టార్గెట్
పట్టణాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హోర్డింగులు ఎక్కువగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంస్థలు ముందుగా అధికారుల నుంచి అనుమతులు పొంది ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ ఎన్నింటికి అనుమతులు పొందారు, ఏఏ సెంటర్లలో ఎన్ని ఏర్పాటు చేశారు అనే అంశాలపై అధికారులకు స్పష్టత లేదు. ఇక ప్రధాన కూడళ్లలో, ఖాళీ స్థలాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటయ్యే వాటికి అసలు అనుమతులు తీసుకోవడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారాల కోసం ముందుగా తాత్కాలికంగా ఏర్పాటై ఆనక అవి పర్మనెంట్ అయిపోతున్నాయి. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో స్థానిక నేతల అనుయాయులు ఇలాంటివి వందల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ వాటిని తొలగించేందుకు అధికారులు సాహసం చేయడం లేదు. గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం అని అంటున్నారు.
బ్యానర్లు, ఫ్లెక్సీలతో మరింత తంటా
కేవలం హోర్డింగులే కాకుండా ప్రతి చిన్న సందర్భంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న బ్యానర్లు, ఫ్లెక్సీల కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి ఏర్పాటుకు అసలు అనుమతులే తీసుకోవడం లేదు. వీటివల్ల నగర సుందరీకరణకు కూడా విఘాతం కలుగుతోంది.
అనధికారికం ఎన్నో..
జిల్లాలోని రెండు నగర పాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీల్లో 2,200 పైగా హోర్డింగులు సుమారు 300 ఏజెన్సీల ద్వారా ఏర్పాటై ఉన్నాయి. ఇవికాక మరో 1200 వరకూ అనుమతుల్లేనివి ఉన్నట్టు తెలుస్తోంది.
రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో 88 ఏజెన్సీలకు చెందిన 750 పైగా హోర్డింగులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
వీటి ద్వారా ఏడాదికి రూ.రెండు కోట్ల వరకూ కార్పొరేషన్ కు ఆదాయం లభిస్తోంది.
అనధికారికంగా సుమారు 500 హోర్డింగులున్నట్టు అంచనా.
ఈ కారణంగా ఏటా రూ.75 లక్షల వరకూ ఆదాయాన్ని కార్పొరేషన్ కోల్పోతోంది.
కాకినాడలో 70 ఏజెన్సీలకు చెందిన 800 వరకూ అధికారిక హోర్డింగులు ఉన్నాయి.
వీటి ద్వారా సాలీనా సుమారు రూ.1.75 కోట్ల ఆదాయం లభిస్తోంది.
ఇవికాక అనుమతుల్లేని హోర్డింగులు సుమారు 400 ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏడు మున్సిపాలిటీల్లో 650 హోర్డింగుల వరకూ ఉంటాయని ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తోంది.
ఇవికాక మరో 350 వరకూ అనధికారికంగా ఏర్పాటై ఉన్నాయి.
వీటన్నింటి ద్వారా ఆయా మున్సిపాలిటీలకు సుమారు రూ.కోటి ఆదాయం లభిస్తోంది.
ఈ ప్రాంతాల్లో అధికారుల కళ్లు కప్పి ఏర్పాటైనవి సుమారు 350 వరకూ ఉంటాయి.
వీటి ద్వారా మరో రూ.50 లక్షల ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీలు కోల్పోతున్నాయి.
Advertisement
Advertisement