రాజమండ్రి క్రైం :మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ వి.రాజేంద్రప్రసాద్ ఇంట్లో, కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆర్డీ కృష్ణా జిల్లా తిరువూరులో ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన నేపథ్యంలో రాజమండ్రిలో పాత సోమాలమ్మ ఆలయం సమీపంలోని ఆయన ఇంటిలో, వీఎల్ పురంలోని ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. వివరాలిలా ఉన్నారుు. మున్సిపల్ రీజనల్ డెరైక్టర్‌గా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ వినోద్‌ను ఇటీవల సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటే తనకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వినోద్ బతిమిలాడినా కనికరించకుండా అడిగి మొత్తాన్ని ఇవ్వాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో వినోద్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం.. వినోద్ తిరువూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆర్డీ రాజేంద్రప్రసాద్‌ను కలిసి వినోద్ రూ.50 వేలు ఇచ్చాడు. అదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఆ సొమ్మును క్యాంప్‌క్లర్క్ నాగరాజు ద్వారా తీసుకుంటుండగా రాజేంద్రప్రసాద్‌ను పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ సీఐ శ్రీనివాసరావు రాజమండ్రి చేరుకుని రాజేంద్రప్రసాద్ ఇంటిలో, కార్యాలయంలో సోదాలు చేసి.. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ రాజమండ్రి రేంజ్ డీఎస్పీ పి. రామచంద్రరావు ఆయనకు సహకరించారు.
రాజమండ్రితో రాజేంద్రప్రసాద్‌కు అనుబంధం
ప్రస్తుతం ఏసీబీకి చిక్కిన రాజేంద్రప్రసాద్‌కు రాజమండ్రితో చాలా అనుబంధం ఉంది. 2007 నుంచి 2009 ఒకసారి, 2013 నుంచి 2014 వరకూ మరో సారి రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2007 నుంచి 2008 వరకూ ఒకసారి, 2009 నుంచి 2013 వరకూ మరోసారి మున్సిపల్ రీజనల్ డెరైక్టర్‌గా పని చేశారు. అనంతరం బదిలీపై నెల్లూరు కమిషనర్‌గా వెళ్లి మళ్లీ 2014 డిసెంబర్ 21న ఆర్డీగా రాజమండ్రి వచ్చారు.
గతంలోనే పలు అభియోగాలు..
ప్రస్తుతం ఆర్డీ రాజేంద్రప్రసాద్ ఏసీబీ చిక్కినట్టుగానే 2008లో అప్పటి ఆర్డీ సీసీ రామచంద్రరావు కూడా ఒక ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అప్పట్లో ఆ సంఘటన మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందిలో చర్చనీయాంశంగా మారగా.. ప్రస్తుతం రీజనల్ డెరైక్టరే లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో సంచలనమైంది. అరుుతే ఆర్డీపై గతంలోనే అనేక అభియోగాలు ఉన్నా...ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని పలువురు అంటున్నారు. వినోద్ ఫిర్యాదుతో ఇన్నాళ్లకు బాగోతం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఉదయం అభినందన...సాయంత్రం అభిశంసన
తిరువూరు : మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశానికి తిరువూరు వచ్చిన ఆర్డీ రాజేంద్రప్రసాద్ అభినందనలు పొందిన కొద్దిసేపటికే ఏసీబీకి చిక్కారు. ఆర్టీని ఎం ఆర్‌పీఎస్ కార్యకర్తలు నగర పంచాయతీ కార్యాలయంలో ఉదయం శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం ఒంటిగంట వరకు సమీక్ష జరిపిన ఆర్డీ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు భోజనానికి వెళ్లి లంచం తీసుకుంటూ పట్టుబడటం గమనార్హం.
ఏసీబీ వలలో ఆర్డీ రాజేంద్రప్రసాద్
Published Wed, May 13 2015 2:08 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement