కమిషనర్ల పని కత్తి మీద సామే
Published Thu, Jan 23 2014 5:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
సాక్షి, రాజమండ్రి :‘తాత్కాలిక ఉద్యోగులకు ఎలాంటి రుణాలు ఇచ్చినా చర్యలు ఉంటాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి జమ చేయడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. జమా ఖర్చుల విషయంలో కచ్చితంగా ఉండాలి. అమలు చేస్తున్న పథకాల్లో అలసత్వంపై చర్యలు ఉంటాయి’.. ఇలా మున్సిపల్ కమిషనర్ల నెత్తిన ఆంక్షల కత్తి పెట్టింది పురపాలక శాఖ. ప్రజలు ఎన్నుకునే పాలకమండళ్లు ఏర్పడే లోపే ప్రత్యేకాధికారుల పాలనలోనే పురపాలికల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే చర్యల మిషతో ప్రభుత్వం కమిషనర్ల విసృ్తతాధికారాలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తోంది. మున్సిపల్ రీజియన్ల డెరైక్టర్లకు పై అంశాలపై తనిఖీ అధికారాలు ఇవ్వడమే కాక మాట వినని వారిపై చర్యలకు ఆదేశించే హక్కును కూడా కట్టబెట్టారు. దీంతో కమిషనర్లు.. ఆర్థికపరంగా ఏ నిర్ణయం తీసుకుంటే నిప్పుతో చెలగాటమవుతుందోనని, ఏ చర్యలు చేపడితే చీవాట్లు పడతాయోనని తలలు పట్టుకుంటున్నారు.
అభివృద్ధి కన్నా రాబడే ముఖ్యం..పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పక్కన పెట్టయినా సరే ఆదాయం పెంచుకోవాలనే ధోరణితో ఉన్న పురపాలక శాఖ ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి పెట్టింది. ఈ ఏడాదిఎట్టి పరిస్థితుల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నతాధికారులు లక్ష్యాలు చేరని కమిషనర్లపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలే ఒక పక్క స్థానిక రాజకీయ ఒత్తిళ్లు, మరో పక్క ఉన్నతాధికారుల ఆదేశాల నడుమ నలిగిపోతున్న కమిషనర్లకు కొత్తగా పెడుతున్న ఆర్థిక ఆంక్షలు సంకె ళ్లలా పరిణమిస్తున్నాయని జిల్లాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.
మింగుడు పడని చేదుమాత్రలు
నాలుగు రోజుల క్రితం రీజనల్ డెరైక్టర్లతో ఆ శాఖ డెరైక్టర్ బి.జనార్దనరెడ్డి హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 12 అంశాలపై కమిషర్లపై ఒత్తిడి తేవాలని, మాట వినని వారిపై నివేదిక పంపాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ అధికారాలను ఆర్డీలకు అప్పచెప్పారు. ఇప్పటికే రాజమండ్రి ఆర్డీ రవీంద్రబాబు పన్నుల వసూళ్లపై కమిషనర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.అలాగే జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఆర్ధిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‘చెత్తపై కొత్త సమరం’ పేరుతో వంద రోజుల కార్యక్రమం, బాగా చదువుకుందాం, స్ట్రీట్ వెండర్స్‌పై సర్వే, ఇల్లులేని వారికి షెల్టర్లు కల్పించేందుకు సర్వే, అనధికారిక కట్టడాల సర్వే, పెండింగ్ కోర్టు కేసుల వ్యవహారాలు.. ఇలా ఇప్పటికే కమిషనర్లు తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమపై మరింత ఒత్తిడి పెంచే నిర్ణయాలు వారికి చేదుమాత్రల్లా మింగుడుపడడం లేదు.
Advertisement
Advertisement