ప్రచార పటాటోపం
కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం
జిల్లా అంతటా హోర్డింగ్‌లు
ఆర్థిక లోటులోనూ వృథా ఖర్చు
ప్రచార ఆర్భాటంపై విమర్శల వెల్లువ
విశాఖపట్నం: అధికారం చేపట్టి తొమ్మిది నెలలవుతున్నా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకు, సెమినార్లలో సావనీర్లు విడుదలచేసి పంపిణీకి డబ్బులు మంంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రచారం పేరుతో వృథా ఖర్చు ప్రారంభించారు. జిల్లాలో ఏ మూలకెళ్లినా బాబు ప్రచార హోర్డింగ్‌లే కనిపిస్తున్నాయి. బస్సులపైనే కాదు..బస్‌షెల్టర్లు, ప్రధాన,మారుమూల కూడళ్లలో సైతం భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ ప్రచార హోర్డింగ్‌ల కోసం ఒక్క విశాఖ జిల్లాలోనే అక్షరాల కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. ఇక రాష్ర్టవ్యాప్తంగా ఎన్ని కోట్లు ఈ రూపంలో తలగేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ర్టంలో రైతులకు రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా మొదటివిడతలో కేవలం నాలుగున్నరవేల కోట్లతో సరిపెట్టింది. రెండోవిడత కోసం బడ్జెట్‌లో మరో 5వేల కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ రెండువిడతల్లో 82.66లక్షల మందిరైతులకు రుణవిముక్తి కల్పించినట్టుగా ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇవేకాదు..ఇలాంటి లేనిగొప్పలు చెప్పుకుంటూ వెలిసిన హోర్డింగ్‌ల పట్ల సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 544 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 2,75,980 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల కోసం రూ.89,42,690లు ఖర్చు చేస్తున్నారు. ఇక సుమారు 160 బస్‌షెల్టర్లలో 36,557 చదరపు అడుగుల హోర్డింగ్‌ల కోసం రూ. 52,51, 570 ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రచారహోర్డింగ్‌ల కోసం ఏకంగా కోటి 41 లక్షల 94 వేల 260 చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 13 జిల్లాల్లో తమ ప్రభుత్వ గొప్పతనం ప్రచారం కోసం సర్కార్ అక్షరాల రూ.20కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇక బస్సులపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల కోసం మరో నాలుగైదు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రచారార్భాటం కోసం గత నెలలో జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు. ఒక్కొక్క రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శించే విధంగా డిజైన్ చేసిన ఈ కార్యక్రమం కోసం రాష్ర్టంలో రూ.4కోట్ల వరకు ఖర్చు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ హోర్డింగ్‌ల పేరుతో మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక లోటు సాకుతో ట్రెజరీ ద్వారా చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించిన ప్రభుత్వం బొటాబొటీగా జీతభత్యాలు మాత్రమే చెల్లిస్తూ మిగిలిన చెల్లింపులకు సవాలక్ష కొర్రీలు వేస్తోంది. ట్రెజరీల్లో వందల కోట్లకు చెందిన వేలసంఖ్యలో బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ప్రచారం కోసం ఈ వృథా ఖర్చు లెందుకని విపక్షాలు.. మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు.